Saturday, October 15, 2016

సెట్లో పవన్‌కల్యాణ్‌ ఏంచేశారో తెలుసా?

 పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ని అభిమానులు విపరీతంగా ఆరాధిస్తుంటారు. అభిమానులే కాదు తోటి నటులూ ఆయనను అంతగానే ఇష్టపడతారు. తాజాగా నటుడు శివబాలాజీ పవన్‌ మంచితనం గురించి మరోసారి తెలియజేశారు. డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రంలో శివబాలాజీ పవన్‌ సోదరుడి పాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం శివబాలాజీ పుట్టినరోజు. ఆరోజు సెట్‌లో ఏం జరిగిందో శివబాలాజీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వివరించారు.
 
‘పవన్‌కల్యాణ్‌ గారు లొకేషన్‌కి వచ్చారు. వెంటనే లేచి గుడ్‌ మార్నింగ్‌ సర్‌ అన్నాను. ఆయన నన్ను పలకరిస్తున్నంతలోనే దర్శకులు డాలీ, పవన్‌కల్యాణ్‌ గారితో ఇవాళ శివ పుట్టినరోజు సర్‌ అని చెప్పారు. వెంటనే పవన్‌గారు నా భుజంమీద చెయ్యివేసి నీ కోసం ఏమన్నా చెయ్యాలోయ్‌ అని, ప్రొడక్షన్‌ అని పిలిచారు. వెంటనే ప్రొడక్షన్‌ చీఫ్‌ ఆయన ముందు హాజరు. నా కొక కేక్‌ కావాలి.. పెద్దదిగా ఉండాలి.. ఏం శివా బ్లాక్‌ ఫారెస్ట్‌ కేక్‌ నచ్చుతుందా? అన్నారు.. నేను అలాగే కళ్ళప్పగించి ఎస్‌ సర్‌ అన్నాను. కొద్దిసేపటిలో అన్నీ అమరిపోయాయ్‌. మధు(నా భార్య, నటి)ని పిలవచ్చా అని అడిగాను. పిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా రమ్మనవోయ్‌ అన్నారు. పవన్‌ గారి మానవత్వానికి, ఆయన చేసే కొన్ని వేల సేవలలో.. నా పుట్టినరోజునాడు చేసింది చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ అంతటి మహామనిషి నాకు ఇంత విలువనివ్వటం!!! విలువకట్టలేని, మాటలలో చెప్పలేని మహదానుభూతి. నా జీవితంలో ఈ పుట్టినరోజును మధురానుభూతిగా నిలిపిన దర్శకుడు డాలీ(కిషోర్‌కుమార్‌ పార్ధసాని)కి ధన్యవాదాలు’ అని శివబాలాజీ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు కేక్‌ కట్‌ చేసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Friday, October 14, 2016

ఆమె ‘బాహుబలి’లో నటించనందట!

 ‘బాహుబలి’ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా భారత చిత్ర పరిశ్రమ ఖ్యాతిని చాటింది. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం కోసం దాదాపు అందరు నటీనటులు ఎదురుచూస్తుంటారు. అయితే ఈ చిత్రంలోని రమ్యకృష్ణ పాత్రలో నటించేందుకు శ్రీదేవి నిరాకరించిన సంగతి తెలిసిందే. కేవలం ఆమే కాదు మరో నటి కూడా ‘బాహుబలి’లో నటించేందుకు ఒప్పుకోలేదట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్‌ కథానాయిక సోనమ్‌ కపూర్‌. ఇటీవల చాట్‌ షో కార్యక్రమంలో ‘బాహుబలి’ చిత్రంపై తన అభిప్రాయం గురించి అడిగిన ప్రశ్నకు సోనమ్‌ కపూర్‌ షాకింగ్‌ సమాధానం ఇచ్చారు.
‘ఆ సినిమా(బాహుబలి) చూడలేదు. నేను ఆ చిత్రం కథ విన్నాను, అందులో నటించే అవకాశం వచ్చింది. కథ అద్భుతంగా ఉంటుంది’ అని సోనమ్‌ అన్నారు. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టగానే ఇంత చక్కటి అవకాశాన్ని సోనమ్‌ ఎందుకు వదులుకుంది? అని ఆశ్చర్యపోయారట. మరి ఏ కారణంగా ఈ అవకాశం వద్దనుకుందో, ఏ పాత్రలో తనను నటించమన్నారో సోనమ్‌ చెప్పలేదు.

దీపావళికి చూపిస్తారా?

 మహేష్‌బాబు, మురుగదాస్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ దీపావళికి టీజర్‌ని విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబరు నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. చెన్నైలోనూ కొంత మేర షూటింగ్‌ జరిగింది. ప్రస్తుతం చిత్రబృందం టైటిల్‌ వేటలో ఉంది. ‘వాస్కోడిగామా’, ‘ఎనిమీ’, ‘అభిమన్యుడు’ ఇలా చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవేం కాదని చిత్రబృందం స్పష్టం చేసింది. తెలుగు, తమిళ భాషలు రెండింటికీ సరిపోయేలా టైటిల్‌ ఉండాలని మహేష్‌ భావిస్తున్నారట. దీపావళిలోగా టైటిల్‌ విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Thursday, October 13, 2016

వెస్టిండీస్ క్రికెటర్ తో తెలుగు హీరోయిన్ డేటింగ్..?

 దాదాపు దశాబ్దకాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసిన శ్రియ, ప్రస్తుతం తన వయసుకు తగ్గ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. వెండితెర మీద వరుసగా అవకాశాలు రాకపోయినా.. ర్యాంప్ షోలు, ఓపెనింగ్ ఈవెంట్ లతో కాలం గడిపేస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబందించిన మరో వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఇంత వరకు ఏ స్టార్ తో శ్రియాకు రిలేషన్ ఉన్నట్టుగా వార్తలు రాలేదు. తాజాగా ఓ వెస్టిండీస్ క్రికెటర్ తో ఈబ్యూటి సన్నిహితంగా ఉంటుందన్న వార్త, మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో తో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటికి వస్తున్న శ్రియ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నిజంగానే శ్రియా, బ్రావోల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి తమ రిలేషన్ పై ఈ స్టార్స్ ఎప్పటికీ స్పందిస్తారో చూడాలి.

Wednesday, October 12, 2016

అనుష్కశర్మ స్థానంలో త్రిష?

 బాలీవుడ్‌ కథానాయిక అనుష్క శర్మ నటించిన థ్రిల్లర్‌ సినిమా ‘ఎన్‌హెచ్‌ 10’. ఫిమేల్‌ ఓరియెంటెడ్‌గా 2015లో మార్చిలో విడుదలైన ఈ సినిమా విజయం అందుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అనుష్క శర్మ పాత్రలో నటించడానికి త్రిషను నిర్మాతలు కలిసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇటీవల ‘నాయకి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిష ప్రస్తుతం‘మోహిని’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ధనుష్‌తో కలిసి ఆమె నటించిన ‘కోడి’ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని ‘ధర్మయోగి’ టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు.

Sunday, October 9, 2016

సీనియర్స్‌తో సై...

 అక్షరా హాసన్ సెలైంట్‌గా తమిళంలో బిజీ అయిపోతోంది. ‘షమితాబ్’ చిత్రం ద్వారా హిందీ తెరకు నాయికగా పరిచయమైన అక్షర ఆ తర్వాత అక్కడ వేరే సినిమాలు కమిట్ కాలేదు. ఈ మధ్యే తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి అంగీకరించింది. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ నాయిక. తాజాగా విశాల్ హీరోగా రూపొందుతోన్న ‘తుప్పరివాలన్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించింది. తుప్పరివాలన్ అంటే డిటెక్టివ్ అని అర్థం.
ఇందులో  కథానాయికగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తోంది. రకుల్ కంటే కాజల్ సీనియర్. రకుల్ వచ్చి నాలుగైదేళ్లవుతోంది. ఈ ఇద్దరితో పోల్చితే అక్షర జూనియర్. మరి.. ఇద్దరు సీనియర్ నాయికలున్న సినిమాలో ఓ నాయికగా నటించడమంటే అక్షరకు సవాలే. అయినా.. లోక నాయకుడు కమల్‌హాసన్ కూతురు కదా... సీనియర్స్‌కి ధీటుగా అక్షర నటిస్తుందని ఊహించవచ్చు.

Saturday, October 8, 2016

జాకీచాన్‌ను చూసినప్పుడు మాట రాలేదు!

బాలీవుడ్‌ నటి అమైరా దస్తూర్‌.. మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు, నటుడు జాకీచాన్‌తో కలిసి ‘కుంగ్‌ ఫు యోగా’ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో జాకీచాన్‌తో కలిసి నటించడం కలలాంటి అనుభవమని అమైరా అన్నారు. ‘నేను తొలిసారి జాకీ సార్‌ను కలిసినప్పుడు ఆనందం, ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. మౌనంగా ఉండిపోయా. తర్వాత జాకీచాన్‌ చాలా మంచి వారు, నేను ఏ ఫీలింగ్‌, భయం లేకుండా మాట్లాడగల ఇతర వ్యక్తుల్లాగే ఆయనా ఓ సామాన్య వ్యక్తని గ్రహించా. జాకీచాన్‌ ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడైనా తనే గొప్ప అనే విధంగా ఎప్పుడూ ప్రవర్తించరు. ఆయనతో కూడిన సన్నివేశాల్ని మొదట తీయాలని అనుకోరు. అందరు నటీనటులకు జాకీచాన్‌ ఆదర్శం.
ఆయన మాటలతో కాకుండా యాక్షన్‌తో టెక్నిక్స్‌ను చూపించడానికి ప్రాధాన్యం ఇస్తారు. సినిమా సెట్‌లో ఆయన సీన్లను షూట్‌ చేయకపోయినా, ఓ వైపు నిల్చుని జోక్యం చేసుకోకుండా షూట్‌ చూస్తుంటారు. షూటింగ్‌లో ఏదైనా లోపం ఉంది అనిపించినప్పుడు మాత్రం సలహా ఇస్తారు’ అని చెప్పారు అమైరా.

Tuesday, October 4, 2016

కొత్త జిల్లాల్లో దసరాకు సెలవు నో

 దసరా పండుగ రోజున ఉద్యోగులు విధిగా విధులకు హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రోజున కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నందు న సెలవును రద్దు చేసింది. జిల్లాల  పునర్విభజనతో సంబంధ మున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు.

 జిల్లాల ప్రారంభం రోజున ఉదయం 10:30 గంటలకల్లా కలెక్టరేట్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా వర్క్ టు సర్వ్ ఆర్డర్లను అందజేయాలని సూచించారు. అన్ని విభాగాల ఉద్యోగులకు వర్తించేలా సింగిల్ ఆర్డర్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక పునర్విభజన పరిధిలోకి రాని ఉద్యోగులు సోమవారం (10వ తేదీ) ఐచ్చిక సెలవును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
 
వేడుకలు నిర్వహించండి
నూతన జిల్లా, డివిజన్, మండలాలకు అవసరమైన ఫైళ్లు, స్టేషనరీ, ఫర్నిచర్ ఇతర సరంజామాను ఆయా కార్యాలయాలకు తక్షణం చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆవిర్భావ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యమైన ఫైళ్లను మాత్రం మాతృ (ప్రస్తుత) జిల్లా కార్యాలయాల్లోనే ఉంచాలని.. పరిపాలన కుదుటపడ్డాక సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేయాలని పేర్కొంది. నూతన మండలాల్లో ఆవిర్భావ వేడుకలను ఇన్‌చార్జి అధికారులు నిర్వహించాలని కోరింది. కొత్త జిల్లాలకు కొత్త వెబ్‌సైట్, ఫేస్‌బుక్ ఖాతాలను అదే రోజున ఆవిష్కరించాలని స్పష్టం చేసింది.
 
తొలి రోజునే పని విభజన
జిల్లాల ఆవిర్భావం రోజునే ఏ అధికారి ఏ విధులు నిర్వహించాలి, ఏయే విభాగం ఏయే దస్త్రాలను పరిశీలించాలన్న అంశంపై పని విభజన జరగాలని సర్కారు ఆదేశించింది. దానివల్ల ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం ఉండదని స్పష్టం చేసింది. ప్రజల నుంచి అందే అర్జీలను పరిష్కరించేందుకు సిటిజన్ చార్టర్ అమలు పక్కాగా జరిగేం దుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇక మండలాలను ఏ, బీ, కేటగిరీ లుగా విభజించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించనుంది. ‘ఏ’ కేటగిరీలోని మండలాలకు ఉద్యోగుల కేటాయింపులో కోత ఉండదు. బీ కేటగిరీ మండలాలకు సిబ్బందిని కుదించనున్నారు. ఆయా మండలాలకు డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఉండదని అధికారవర్గాలు తెలిపాయి.