Friday, April 6, 2018

ఐపీఎల్‌ టోర్నీ శనివారమే ప్రారంభం


అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్‌ మెగా టోర్నీ ఈ శనివారమే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. మరోపక్క ఆటగాళ్లు సైతం వరుస ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలకు అన్ని జట్ల కెప్టెన్లు హాజరు కాని సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథులు రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోనీ మినహా మిగతావారెవరూ ఆరంభ వేడుకల్లో పాల్గొనడం లేదని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. ఐతే, ఈ ఏడాది ఒకే వేదికపై అన్ని జట్ల కెప్టెన్లను చూడలేకపోతున్నాం అని అభిమానులు నిరుత్సాహ పడిపోయారు. తాజాగా నిర్వాహకులు ఐపీఎల్‌ ట్రోఫీతో ఎనిమిది జట్ల సారథులతో ఫొటో షూట్‌ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐపీఎల్‌ ట్విటర్‌ పేజీ ద్వారా పంచుకున్నారు.
ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లను ఒకేసారి చూడటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ‘ఈ సీజన్‌లో ఇలా అన్ని జట్ల కెప్టెన్లనూ ఒకే వేదికపై చూస్తామనుకోలేదు, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తిరిగి ఐపీఎల్‌లో ఆడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.