Thursday, December 24, 2015

సౌఖ్యం సినిమా రివ్యూ


'జాబ్‌లెస్‌, రెక్‌లెస్‌, రూత్‌లెస్‌, రిడిక్యులస్‌.. టోటల్‌గా యూజ్‌లెస్‌' అంటూ హీరో పాత్రని ఇంట్రడ్యూస్‌ చేస్తారిందులో. ఈ సినిమా గురించి వర్ణించడానికి కూడా అదే లైన్‌ని వాడేసుకోవచ్చు. పృధ్వీ, కృష్ణ భగవాన్‌ పాత్రలని పరిచయం చేసే ముందు... వాళ్లు తమ ఊళ్లో పెద్ద సినిమాలు రిలీజ్‌ చేసుకోలేక హిట్‌ అయిన సినిమాలని పేరడీ చేస్తూ సినిమాలు తీసి వాటినే ప్రదర్శిస్తుంటారని చెప్తారు. 'లౌక్యం' సినిమాలాంటి మరో హిట్‌ కావాలంటూ గోపీచంద్‌, ఆనంద్‌ ప్రసాద్‌ అడిగితే.. మళ్లీ అలాంటిది రాయలేక 'లౌక్యం'నే స్పూఫ్‌ చేసి.. 'సౌఖ్యం' అనే టైటిల్‌ పెట్టేసినట్టున్నారు.

           సినిమా అనే కళ అనుక్షణం కుంగిపోయేలా, కంపించిపోయేలా, కళ్లు వాచేలా ఏడ్చి కళ తప్పేలా ఉందీ సౌఖ్యం. హీరో పాత్ర పరిచయానికి ముందు పోలీస్‌ స్టేషన్‌కి పరుగెత్తుకుంటూ వచ్చే అతని ఫ్యామిలీని, వాళ్లు చెప్పే ఫ్లాష్‌బ్యాక్‌ని చూసేసరికే 'ఇన్‌ఫ్రంట్‌ క్రొకడైల్స్‌ ఫెస్టివల్‌' అనే పిక్చర్‌ వచ్చేయాలి. ఒకవేళ అప్పటికీ ట్యూబ్‌లైటు వెలగనట్టయితే... ఫెరోషియస్‌ విలనీకి పేరు పడ్డ ప్రదీప్‌ రావత్‌ వచ్చి 'డోరేమోన్‌' తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌లో కార్టూన్‌ క్యారెక్టర్‌లా ఓవరాక్ట్‌ చేస్తుంటే అయినా సీన్‌ అర్థమైపోవాలి. అప్పటికీ బల్బు వెలగకపోతే ఇక అటుపై వెలగాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఎలాగో ఫ్యూజ్‌లు కొట్టేసి, వెలిగిన బల్బ్‌లు కూడా మాడిపోతాయి!
క్లయిమాక్స్‌ సీన్‌లో విలన్స్‌ని అడ్డుకున్న బ్రహ్మానందాన్ని ఉద్దేశిస్తూ అతని అనుచరుడు హీరోకి ఫోన్‌ చేసి 'త్వరగా రండి సర్‌... కంటెంట్‌ లేకుండా ఎక్కువ సేపు మా సర్‌ మ్యానేజ్‌ చేయలేడు' అని చెప్తాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు కంటెంట్‌ లేక, దీనిని ఎలా మ్యానేజ్‌ చేయాలనేది తెలీక, రెండు గంటలకి పైగా నిడివి ఉండేట్టు చూసుకోవడమెలాగో అర్థం కాక.. తోచిన సన్నివేశాలని, తట్టిన కామెడీని రాసుకుంటూ పోయారనిపిస్తుంది. సప్తగిరికి ఆత్మలు కనిపిస్తాయంటూ మొదలు పెట్టి, రెండు సీన్ల తర్వాత అతడిని పక్కన పడేసారు. వెంకీలో బ్రహ్మానందం పాత్రని అటు తిప్పి, ఇటు తిప్పి రైల్లో పోసానిని దించారు. బొమ్మరిల్లు ఫాదర్‌ని బురిడీ కొట్టించడానికి రఘుబాబుని రెడీలో బ్రహ్మానందంని చేసారు. ఇంక నవ్వించడమెలాగో తెలీదన్నట్టు బాహుబలి, శ్రీమంతుడుని స్పూఫ్‌ చేసి వదిలారు. అక్కడికీ కంటెంట్‌ లేదని బోధ పడి క్లయిమాక్స్‌ ఫైట్‌లో అడ్డం పడి 'లౌక్యం' హిట్‌కి తనవంతు సహకారం అందించిన పృధ్వీ పాత్రకి బదులు బ్రహ్మానందాన్ని పెట్టారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. అడుగడుగునా ఏదో తానులోంచి చింపుకొచ్చిన ముక్కలన్నీ కుట్టి ఇదే కొత్త స్క్రిప్టు అంటూ చేతులు దులిపేసుకున్నారు. ఇక దాని వాటం ఎలాగుంటుందనేది, దాన్ని చూడ్డం ఎంత సౌఖ్యంగా ఉంటుందనేది మీ ఊహలకే వదిలేస్తున్నాం.
               లౌక్యంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన రైటర్లు కనుక వాళ్లిచ్చిన స్క్రిప్టుని గోపీచంద్‌ క్వశ్చన్‌ చేయలేడు. ఆ సినిమా అంత హిట్‌ అయింది కాబట్టి ఈసారి దీనిపై నిర్మాత డౌట్‌ పడలేడు. చేయి తిరిగిన వాళ్లు, చేసి చూపించిన సమర్ధులు ఇచ్చిన దానిని మార్చి తీసే ధైర్యం దర్శకుడు చేయడు. ఇంకేముంది ఇష్టానికి రాసుకున్న స్క్రిప్టు తీరూ తెన్నూ లేకుండా, తలా తోకా తెలీకుండా సౌఖ్యం అనే పదానికి ఎగ్జాక్ట్‌ ఆపోజిట్‌గా మారింది. గోపీచంద్‌ అయినా, జేమ్స్‌బాండ్‌ అయినా ఇలాంటి క్యారెక్టర్‌ ఇస్తే చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సిందే. కెమెరా ముందు ఏదోటి చేసేసి కట్‌ చెప్పించుకోవాల్సిందే. గోపీచంద్‌ అదే చేసాడు. లౌక్యం ఇచ్చారనే కృతజ్ఞతని చూపించి పరిహారం చెల్లించుకున్నాడు. తన సౌఖ్యం కోసమైనా కాస్త లౌక్యం ప్రదర్శిస్తే బాగుండేది. హీరో గురించే చెప్పడానికేం లేదంటే ఇక హీరోయిన్‌ గురించి దేనికిలెండి. నాయికానాయకులే కీలుబొమ్మలైనప్పుడు.. వారికి సహకారం అందించిన వాళ్లు, ప్రతినాయకులైన వాళ్లు మాత్రం ఎలా మెప్పించగలరని. లౌక్యం విజయంలో కీలక పాత్రధారులైన కమెడియన్లు కూడా తమకిచ్చిన స్టేల్‌ జోకులని, స్టింకింగ్‌ స్పూఫ్‌లని పండించడానికి పడ్డ పాట్లు వివరించడమెలాగని?
'శేషూ శేషూ..' అంటూ సప్తగిరి పరిచయం... 'ఎవ్వడంట ఎవ్వడంట' అంటూ పృధ్వీ ఇంట్రడక్షన్‌, 'నా పేరు దయ.. నాకు లేనిదే అది' అంటూ బ్రహ్మానందం రావడం.. అవేమీ సరిపోనట్టు 'గబ్బర్‌సింగ్‌' అంత్యాక్షరి సీన్‌కి ఎక్స్‌టెన్షన్‌! ఇంతకుమించి కామెడీ ఉండదా? లేక కామెడీ అంటే ఇంతే అనుకుంటున్నారా? ఫస్ట్‌ హాఫ్‌లో వాచ్‌ వైపు, సెకండ్‌ హాఫ్‌లో ఎగ్జిట్‌ వైపు చూస్తూ నూట నలభై నిమిషాలు గడవడం ఎంత కష్టమో తెలుసుకుంటాం. వరదల్లో చిక్కుకున్న వాళ్లని చూసి అయ్యోపాపం అంటాం. అలా ఇరుక్కుపోతే తిండి, నీళ్లు, నిత్యావసరాలు ఉండవేమో.. కనీసం అక్కడీ సౌఖ్యం చూసే 'భాగ్యం' ఉండదు. 'అంతకుమించిన' పరీక్షని పెట్టి, వర్ణించలేని విధమైన శిక్షని వేస్తుందీ చిత్రం. హిట్‌ సినిమా అనే దానికి ప్రత్యేకమైన సూత్రాల్లేవు. హిట్‌ కొట్టడానికి ఫలానా అంటూ దిక్సూచి లేదు. మంచి కథ, పకడ్బందీ కథనం ఉన్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వెలితి వచ్చి మొత్తంగా ఫలితం తిరగబడుతుంది. లౌక్యంకి అన్నీ కుదిరేసాయి. ఈసారి దానిని అనుకరించి పాస్‌ అయిపోదామని చూసేసరికి టేకాఫ్‌ అవకుండా రన్‌వేపైనే క్రాష్‌ అయిపోయింది.