Tuesday, March 29, 2016

ఆ హీరోయిన్ పెళ్లైపోయింది

  హీరోయిన్ అంకిత సోమవారం పెళ్లి చేసుకుంది. పుణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ జగ్తాప్ ను ఆమె వివాహమాడింది. ముంబై వర్లీ ప్రాంతంలో ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
రస్నాబేబీగా పాపులర్ అయి ఆ తరువాత బాలతారగా పలు చిత్రాలలో నటించింది. 'లాహిరి లాహిరి లాహిరి' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగు తమిళ, కన్నడ భాషాల్లో 20 పైగా చిత్రాల్లో నటించింది. సింహాద్రి, విజయేంద్రవర్మ, అందురూ దొంగలే దొరికితే, మనసు మాట వినదు, ఖతర్నాక్, సీతారాములు, నవ వసంతం, అనసూయ, వినాయకుడు, అర్జునుడు, పోలీస్ అధికారి తదితర తెలుగు సినిమాల్లో కనిపించింది.

కొంత కాలం క్రితం నటనకు దూరం అయిన అంకిత న్యూయార్క్ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన కోర్స్ చేసింది. ఆ సమయంలో పరిచయం అయిన వ్యాపారవేత్త విశాల్‌తో అంకిత లవ్ లో పడింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి పెళ్లి చేయడంతో ప్రేమకథ సుఖాంతం అయింది.

కొత్త లుక్‌తో... దిల్ ఖుష్!

 ఎర్రటి పంజాబీ డ్రెస్‌లో, చందమామ లాంటి మోముతో తళతళలాడుతున్న అందాల తార ఐశ్వర్యారాయ్ ‘సరబ్‌జిత్’ సిన్మా లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఐష్‌ది మెయిన్ రోల్ కాకపోయినా ఆమే ఈ చిత్రానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అని వేరే చెప్పాల్సిన పని లేదు.

 అందుకే చిత్ర బృందం ఐష్ స్టిల్స్‌ను ఎక్కువగా విడుదల చే సి, సినిమాకు మరింత ప్రచారం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత గూఢచారి అనే అభియోగంతో జీవితాంతం జైల్లోనే మగ్గిపోయిన ‘సరబ్‌జిత్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. తమ్ముడికి జరిగిన అన్యాయం గురించి పోరాడిన సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐష్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

 అందుకు తగ్గట్టే సహజత్వానికి దగ్గరగా లుక్స్ విషయంతో చిత్ర దర్శకుడు ఒమంగ్ కుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరబ్‌జిత్‌గా రణదీప్‌హుడా, ఆయన భార్యగా రిచా చద్దా కనిపించనున్నారు. ఆ మధ్య ‘జజ్బా’ చిత్రం అనుకున్న ఫలితమివ్వకపోవడంతో, ఈ సినిమాతోనైనా హిట్ సాధించాలని ఐశ్వర్య శ్రమిస్తున్నారు.

మరో ఇద్దరు స్టార్‌ వారసుల ఎంట్రీ!


బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహర్‌ తీసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌' సినిమా ఇండస్ట్రికి ఏకంగా ముగ్గురు వారసులను అందించింది. ఈ సినిమా ద్వారా అలియా భట్‌, వరుణ్ ధావన్‌, సిద్ధార్థ మల్హోత్రా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా స్టార్లుగా తమను తాము ఫ్రూవ్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ రాబోతున్నది. ప్రస్తుతం ఇండస్ట్రిలో వినిపిస్తున్న మాట నిజమైతే.. ఈ స్వీకెల్ ద్వారా సైఫ్‌ అలీఖాన్‌, ఆయన మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సరా అలీఖాన్‌, షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్‌ హీరోహీరోయిన్‌లుగా ఇండస్ట్రికి పరిచయం కాబోతున్నారు.










అంతేకాదండోయ్‌.. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నావి కపూర్‌ను కూడా తీసుకోవాలనే ఆలోచన ఉందట. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టులతో హల్‌చల్ చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో తన కెరీర్‌ మొదలు పెట్టాలని భావిస్తోందట. అయితే  'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ లో సైఫ్ కూతురు సరా, ఇషాన్‌ను ఇప్పటికే తీసుకున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. మరోవైపు కరణ్ జోహర్ మాత్రం ఈ సినిమా నటినటులపై ఎక్కడా నోరువిప్పడం లేదు. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ఇటీవల కరణ్ అధికారికంగా ప్రకటించాడు. దీంతో స్టార్ వారసులు చాలామంది తమను లాంచింగ్ చేయమని కరణ్‌ను కోరుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. ఇక షాహిద్ కపూర్ మాజీ ప్రియురాలైన కరీనా సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లాడింది. తాజాగా కరీనా, షాహిద్ 'ఉడ్తా పంజాబ్' సినిమాలో కలిసి నటిస్తున్నారు.