నా మనసులో ప్రేమకు చోటు లేదు అంటున్నారు నటి తమన్నా భాటియా. సాధారణంగా
గాసిప్స్‌కు దూరంగా ఉండే ఈ మిల్కీబ్యూటీ ఇటీవల ప్రభుదేవాతో చెట్టాపట్టాల్
అంటూ వదంతులు హల్‌చల్ చేయడం చాలా మందికి ఆసక్తిని కలిగించింది. అయితే తాను
మాత్రం ప్రస్తుతానికి ప్రేమ కోసం సమయాన్ని కేటాయించే పరిస్థితిలో లేనని
తమన్నా అంటున్నారు.
దీని గురించి ఈ బ్యూటీ కాస్త విపులంగా తెలుపుతూ తాను ఇంకా పలు హీరోలతో
నటించాల్సి ఉందన్నారు. అదే విధంగా తన బయోగ్రఫీ కథలో, మరిన్ని కథా బలం ఉన్న
చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని అన్నారు. స్టార్ హీరోలకు జంటగా,
భారీ బడ్జెట్ కథా చిత్రాలలో నటిస్తున్నప్పటికీ, స్టార్‌డమ్ లేని నటులతో
మంచి కథా చిత్రాలలో నటించాలన్న ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు.
తనకు తానే ఛాలెంజ్ చేసుకునే విధంగా నటించాలని, అప్పుడే తనలో నిద్రాణమై
ఉన్న నటనా ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఏడాదిలో నటించిన
ఊపిరి, ధర్మదురై, దేవి చిత్రాలు ప్రత్యేకత సంతరించుకున్నాయని చెప్పారు. ఇక
పోతే ఒకే ఛాయలున్న కథా పాత్రల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు
తెలిపారు. అదే విధంగా ద్విభాషా చిత్రాల్లో నటించడానికి తనకు అభ్యంతరం లేదు
గానీ, త్రిభాషా చిత్రాల్లో నటించనని చెప్పారు. అలాంటి చిత్రాల్లో ఆయా భాషల
నేటివిటీకి తగ్గట్టుగా నటించాల్సి ఉంటుందని, అలా నటించడం చాలా చాలా
కష్టమని, అలసటకు గురి కావాల్సి ఉంటుందని అన్నారు.