Tuesday, February 7, 2017

‘నేను లోకల్‌’


వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్నాడు నాని. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణగాడివీర ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మ‌న్‌, మజ్ను... ఇలా ఆయ‌న జోరు కొన‌సాగుతూఉంది. ప‌లువురు స్టార్ ద‌ర్శ‌కులు నానితో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపించినా ఆయ‌న మాత్రం మ‌ళ్లీ త‌న‌దైన శైలిలోనే కంటెంట్‌కి ప్రాధాన్య‌మిస్తూ నేను లోక‌ల్‌` చేశాడు. వ‌రుస విజ‌యాల నాని.. దిల్‌రాజు నిర్మాణ సంస్థ‌... దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం... ఇలా విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షిస్తూ అంచ‌నాల్ని పెంచిందీ చిత్రం. మ‌రి సినిమా అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే ఉందా? నాని విజ‌యాల జోరు కొన‌సాగిన‌ట్టేనా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటేరివ్యూలోకి వెళ్లాల్సిందే...
కథేంటి: ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, సరదా సరదాగా తిరిగే కుర్రాడు బాబు(నాని). తనలాగే తాను జీవించాలనే భావాలున్న వ్యక్తి. ఎవరికోసం తనని తాను మార్చుకోడు. కీర్తి(కీర్తిసురేష్‌)ని తొలిసారి చూడగానే మనసు పారేసుకుంటాడు. తన ప్రేమ విషయం చెబితే అందుకు కీర్తి నో చెబుతుంది. ‘నువ్వు ప్రేమించే వరకూ విసిగిస్తా’నని బాబు ఆమె వెంటపడుతుంటాడు. ఈ క్రమంలో అతని మనసును తెలుసుకున్న కీర్తి ప్రేమలో పడుతుంది. ఆ విషయం రేపు ‘మనం కలుసుకున్నప్పుడు’ చెబుతానని బాబుతో అంటుంది. ఈ నేపథ్యంలో కీర్తి కిడ్నాప్‌నకు గురవుతుంది. ఈ విషయం తెలుసుకున్న బాబు ఆమెను రక్షించేందుకు వెళ్లగా, అక్కడ అప్పటికే పోలీస్‌ అధికారి సిద్ధార్థ వర్మ (నవీన్‌ చంద్ర) రౌడీలను చితకబాదుతాడు. కీర్తిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆమె జోలికి ఎవరైనా వస్తే చంపేస్తానంటూ వార్నింగ్‌ ఇస్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బాబు రియాక్షన్‌ ఏంటి? బాబు, కీర్తిల ప్రేమ కథ సుఖాంతం అయిందా? పోలీస్‌ అధికారి సిద్ధార్థ వర్మ కథ ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 ఎలా ఉందంటే?: నాని సినిమా అంటే కుటుంబం మొత్తం హాయిగా చూసే సినిమా అని ఓ మార్కు ఉంది. ఈసారి కూడా అదే ట్రాక్‌లో నడిచాడు నాని. ప్రథమార్ధం నాని-కీర్తి సురేష్‌ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలతో సరదా సరదాగా గడిచిపోతుంది. ఇక నాని తల్లిదండ్రుల పాత్రలను పోసాని కృష్ణమురళి, ఈశ్వరిరావు పోషించారు. ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలూ కడుపుబ్బా నవ్విస్తాయి. కీర్తి సురేష్‌ తన అందాలతో మరోసారి అలరించింది. సిద్ధార్థ వర్మ పాత్ర ప్రవేశంతో సరదాగా సాగే కథ ఓ కీలక మలుపు తీసుకుంటుంది. విరామానంతరం వచ్చే సన్నివేశాలు అన్నీ సిదార్థ వర్మ, బాబు నేపథ్యంలో సాగుతాయి. కీర్తిని ప్రేమించిన ఇద్దరూ వాళ్ల మనసుల్లో ప్రేమను ఎలా బయట పెట్టారు? కీర్తి ఎవరిపై ఎలా మొగ్గు చూపుతుంది అనే విషయాలు ఆకట్టుకునేలా సాగిపోతాయి. అయితే ఎవరి ప్రేమలో ఎంత బలముందో నిరూపించాల్సిన సమయంలో సిద్థార్థ వర్మ ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగగా, బాబు ‘నేనేం చేయను’ అంటూ చెప్పే సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. కథ ఎంతకీ ముందుకు సాగకపోవడంతో ప్రేక్షకుడిని ఒకింత అసహనానికి గురిచేస్తాయి. మళ్లీ పతాక సన్నివేశాల రాకతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ద్వితీయార్ధం నుంచి ముక్కోణపు ప్రేమ కథలా ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిల మధ్య సాగేపోయేలా సన్నివేశాలు ఉన్నాయి. చివరిలో కూడా ఓ కీలకమైన మలుపు ఉండటంతో కథ రక్తి కట్టిస్తుంది. కథ కొత్తది కాకపోయినా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం తెరపై కనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: నాని తన నటనతో వన్‌మ్యాన్‌ షోలా ఆకట్టుకున్నాడు. సంభాషణలు పలికే సమయంలో తనకున్న ఈజీనెస్‌ను మరోసారి ప్రదర్శించాడు. ప్రతీ సన్నివేశంలోనూ సంభాషణలు పలికే విధానంలోనూ రజనీకాంత్‌ను అనుసరించినట్టు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఇదో ప్రేమ కథ అయినా మాస్‌ అంశాలు ఉండటంతో నాని రజనీని అనుసరించే ప్రయత్నం చేశాడు. కీర్తి అందంగా కన్పించింది. ఆమెకు నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది. సిద్ధార్థ వర్మగా నవీన్‌చంద్ర ద్వితీయార్థంలో కనిపిస్తాడు. అతనికీ మంచి పాత్రే దక్కింది. సాంకేతికంగా మంచి మార్కులు పడతాయి. ప్రసన్నకుమార్‌ మాటలు, త్రినాథరావు దర్శకత్వం వారి వారి శైలిలో సాగుతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది. పాటలన్నీ అలరిస్తాయి. ‘దిల్‌’రాజు నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.
చివరిగా: ‘లోకల్‌’ కుర్రాడి ప్రేమకథ