దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ అంధుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు. పటాస్, సుప్రీమ్ లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ మరోసారి మాస్ మహరాజ్ స్టామినాను ప్రూవ్ చేసిందా..? రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద కనిపించిన రవితేజ, అదే స్థాయిలో అలరించాడా..? దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ విజయం దక్కిందా..?
కథేంటంటే: నిజాయతీ కలిగిన ఓ పోలీస్ ఆఫీసర్(ప్రకాష్‌రాజ్). ఆయనకో కుమార్తె లక్కీ(మెహరీన్). ఆ ఆఫీసర్‌కు కూతురంటే ప్రాణం. ఓ కేసు విషయంలో దేవ(వివన్ భటేనా) తమ్ముడిని ఎన్‌కౌంటర్ చేస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. తన తమ్ముడిని చంపేశాడనే కోపంతో అతడిపైనా, అతని కుమార్తె లక్కీపైనా పగ పెంచుకుంటాడు దేవ. లక్కీ కళ్లముందే ఆమె తండ్రిని చంపేస్తాడు. అప్పటినుంచి దేవ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది లక్కీ. రాజా(రవితేజ) పుట్టుకతో అంధుడు. కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువ. రాజాను వాళ్ల అమ్మ(రాధిక) పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటుంది. మరోపక్క దేవ నుంచి లక్కీని కాపాడేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రయత్నిస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాజా ఏం చేశాడు? విలన్ గ్యాంగ్ నుంచి ఆమె ఎలా కాపాడాడు? అంధుడైన రాజా చివరికి ‘రాజా ది గ్రేట్’ అనిపించుకున్నాడా?
ఎలా ఉందంటే: ఒక హీరో.. హీరోయిన్‌ను కాపాడటం అనేది రొటీన్ స్టోరీ. అయితే ఆ హీరో అంధుడు కావడమే ‘రాజా ది గ్రేట్’ చిత్రం ప్రత్యేకత. ముఖ్యంగా హీరో పాత్రను డిజైన్ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది. అంధుడైన కథానాయకుడు ఒక బలమైన ప్రతినాయకుడిని ఎలా ఎదుర్కొన్నాడనే దాన్ని దర్శకుడు ఆకట్టుకునేలా చూపించాడు. డార్జిలింగ్ ఎపిసోడ్, కబడ్డీ ఆడే సన్నివేశాలు అలరిస్తాయి. యాక్షన్ సన్నివేశాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రథమార్ధం చక్కని హాస్య సన్నివేశాలతో ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. ఇక ద్వితీయార్ధాన్ని హీరో-విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలతో తీర్చిదిద్దాడు దర్శకుడు. ఎంటర్‌టైన్‌మెంట్ కన్నా యాక్షన్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. సెకండాఫ్‌లో వచ్చే మూడు ఫైట్‌లను మూడు రకాలుగా డిజైన్ చేసుకున్నాడు. ఒక దశలో సినిమా అయిపోయిందేమో అనిపిస్తుంది. కానీ పాటో, ఫైటో వస్తుంది. కొన్ని సన్నివేశాలు కేవలం నిడివి కోసం రాసుకున్నారేమో అనిపిస్తుంది. కాస్త సాగదీతతో ఉన్నప్పటికీ అది వినోదాత్మకంగా చెప్పడంతో ప్రేక్షకుడు ఎక్కడా ఇబ్బందిపడడు. అయితే ద్వితీయార్ధాన్ని మరింత షార్ప్‌గా ఎడిట్ చేయాల్సింది. సినిమా మొత్తంలో హీరో-హీరోయిన్‌ల మధ్య ఎక్కడా లవ్ ట్రాక్ కనిపించదు. కానీ పాటలు వచ్చిపోతుంటాయి. వారి మధ్య కెమిస్ట్రీ చూపించలేదు. ‘గున్నాగున్నామామిడి...’ పాట ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది.
చివరిగా: ‘రాజా ది గ్రేట్’.. రవితేజ ది గ్రేట్