అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుస్మిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న
చిత్రం రాజుగారింట్లో 7వరోజు. భరత్‌కుమార్ పీలం నిర్మిస్తున్న ఈ చిత్రానికి
ఫిరోజ్ రాజ దర్శకుడు. కనిష్క్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవలే
హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను హీరో తరుణ్ ఆవిష్కరించారు. తొలి
ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజ స్వీకరించారు. దర్శకుడు మాట్లాడుతూ హారర్
అంశాలకు వినోదాన్ని మేళవించి రూపొందించిన చిత్రమిది. ఓ భవంతిలో కొందరు
యువతీయువకులకు ఎదురైన అనూహ్య సంఘటనలేమిటి? ఆ భవంతి గురించి వారు
తెలుసుకున్న నిజాలేమిటి? అన్నది సినిమాలో ఉత్కంఠను కలిగిస్తుంది. వాణిజ్య
హంగులన్ని పుష్కలంగా ఉంటాయి అని తెలిపారు. కథలోని కొత్తదనాన్ని నమ్మి చేసిన
చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. కథానుగుణంగా నాలుగు పాటలు అద్భుతంగా
కుదిరాయని సంగీత దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదాల రవి, సాయివెంకట్
తదితరులు పాల్గొన్నారు.