ఇదివరకు
కథానాయికల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండేది. ఒకే సినిమాలో నటించినా
సరే... ఒకరి గురించి మరొకరు మాట్లాడేందుకు ఇష్టపడేవాళ్లు కాదు.
ఇటీవల మాత్రం దోస్త్ మేరా దోస్త్ అంటూ ఐక్యతారాగం పాడుతున్నారు. ఎదుటి
కథానాయిక ఒక మంచి పాత్ర చేసిందంటే చాలు... వెంటనే వాళ్లని అభినందించే
పనిలో పడిపోతుంటారు. అనుష్క అయితే మొదట్నుంచీ తోటి కథానాయిలతో
స్నేహంగా మెలుగుతోంది. అందుకే ‘అనుష్క నిజంగా స్వీటీనే’ అంటుంటారు
ఆమెతో కలిసి ప్రయాణం చేసిన కథానాయికలు. హిందీ కథానాయిక సోనాక్షి
సిన్హా మొదలు తమన్నా వరకు చాలామంది అనుష్కని బహిరంగంగా పొగిడినవాళ్లే.
నిజంగా మీకెప్పుడూ, ఏ కథానాయికపైనా ఈర్ష్య పుట్టింది లేదా? అని అనుష్కని
అడిగితే... ‘‘మేం స్నేహంగా ఉన్నంతమాత్రాన మామధ్య పోటీ ఉండదనుకోకండి.
అసలు పోటీ లేకపోతే ఏ వృత్తినీ ఆస్వాదించలేం. మరింత మంచి పాత్రలు ఎంచుకోవాలి,
వేరొకరి కంటే బాగా నటించాలనే తపన మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఒక రకంగా
చెప్పాలంటే అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఇక ఈర్ష్య, ద్వేషం
కలగడం లాంటివంటారా?... ఒక మంచి అవకాశం అందినప్పుడు - ‘ఇలాంటి
పాత్ర నాకు కాకుండా వేరొకరికి వెళ్లుంటే, నిజంగా వాళ్లని ద్వేషించేదాన్నేమో
కదా. వాళ్లపై నాకు అసూయ పుట్టేదేమో కదా’ అనిపిస్తుంటుంది. ఎందుకంటే
అలాంటి పాత్రలు నాకు చాలాసార్లే లభించాయి. అందుకే పుడితే గిడితే నామీదే
నాకు ఈర్ష్య పుట్టాలి తప్ప వేరొకరిపై కాదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం
అనుష్క ‘బాహుబలి- ది కన్‌క్లూజన్’లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.