రేటింగ్ 3 /5
చాలా కాలం తరువాత బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ షారూక్ ఖాన్, కాజోల్ కలిసి నటించిన సినిమా దిల్ వాలే. మాస్ కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి తన పంథా మార్చి రొమాంటిక్ జానర్ లో తెరకెక్కించిన ఈ సినిమా.. రిలీజ్ కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. సావరియా, ఓం శాంతి ఓం సినిమాల సమయంలో వెండితెర మీద పోటీపడిన షారూఖ్, సంజయ్ లీలా బన్సాలీలు మరోసారి దిల్ వాలే, బాజీరావ్ మస్తానీ సినిమాలతో ఢీకొన్నారు. మరి ఈ పోటిలో దిల్ వాలే విజయం సాదించిందా..?
కథ:
రాజ్ (షారూక్ ఖాన్), వీర్ (వరుణ్ ధవన్)లు కార్లను మోడిఫికేషన్ చేసే గ్యారేజ్ నడుపుతుంటారు. వీర్ తన కార్ లో లిఫ్ట్ తీసుకున్న ఇషిత (కృతిసనన్)తో ప్రేమలో పడతాడు. అయితే తమ ప్రేమకు తన అన్నను ఒప్పించే ప్రయత్నం చేయాలనుకుంటాడు. అదే సమయంలో రాజ్ గతం తెలుస్తుంది. రాజ్ అసలు పేరు కాళీ, 15 ఏళ్ల కిందట బల్గేరియాలో ఓ మాఫియా డాన్. తన తండ్రితో కలిసి స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఈ వ్యాపారపరంగా మరో డాన్ తో వీరికి శతృత్వం ఏర్పాడుతుంది. కానీ షారుఖ్ అనుకోకుండా ప్రత్యర్థి కూతురు మీరా(కాజోల్)తో ప్రేమలో పడతాడు. తండ్రుల మధ్య ఉన్న వైరం ఆ ప్రేమికులను విడదీస్తుంది. 15 ఏళ్ల తరువాత వీర్, ఇషితల ప్రేమ కారణంగా మరోసారి రాజ్, మీరా కలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తిరిగిన తన ప్రేమను గెలుచుకున్నాడా.. అన్నదే అసలు కథ.
విశ్లేషణ:
ఈ సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది కాజోల్ నటన గురించి. లాంగ్ గ్యాప్ తరువాత వెండితెర మీద కనిపించిన ఈ డస్కీ బ్యూటీ గ్లామరస్ అపియరెన్స్ తో పాటు యాక్టింగ్ తోనూ ఆడియన్స్ ను కట్టిపడేసింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో షారూఖ్ మరోసారి మెప్పించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో షారూక్ నటన అద్భుతం. ఈ ఇద్దరి కెమిస్ట్రీ.. సినిమానే కాదు.. ఆడియన్ మూడ్ ను 1990ల లోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ తో మరోసారి బాలీవుడ్ బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు షారూఖ్, కాజోల్. వరుణ్, కృతి కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో నటించిన జానీ లీవర్, బొమన్ ఇరానీ, వరుణ్ శర్మ, సంజయ్ మిశ్రాల కామెడీ ఆకట్టుకుంది.
పైసా వసూల్ సినిమాలను తెరకెక్కించటం బాగా తెలిసిన రోహిత్ శెట్టి మరోసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. రెగ్యులర్ గా తను ఎంచుకునే యాక్షన్ కామెడీకి తోడు ఈసారి కాస్త రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చాడు. అయితే ఆ జానర్ ను ఆశించిన స్థాయిలో ప్రజెంట్ చేయటంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా షారూఖ్, కాజోల్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రొటీన్ గా అనిపిస్తాయి. యాక్షన్ కామెడీ కూడా రెగ్యులర్ రోహిత్ శెట్టి సినిమాల తరహాలోనే సాగిపోతుంది. భారీ ఛేజ్ లు, కార్ బ్లాస్ట్ లు, పంచ్ డైలాగులు ఇలా అన్ని రకాల మాస్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ట్రీట్ ఇచ్చాడు రోహిత్.