Friday, February 17, 2017

రివ్యూ : ఘాజీ


  కథేంటంటే..?: 1971లో ఇండియన్‌ సబ్‌మెరైన్‌ ఎస్‌ 21కీ.. పాకిస్థానీ జలంతర్గామి ఘాజీకీ మధ్య జరిగే నీటి యుద్ధం ఈ కథ. లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ (రానా).. కెప్టెన్‌ రణ్‌ విజయ్‌సింగ్‌ (కె.కె.మీనన్‌)లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడారు? 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో పాక్‌ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేదే కథ.
ఎలా ఉందంటే..?: ఇండియా - పాక్‌ యుద్ధమంటే మనందరికీ కార్గిల్‌ యుద్ధం.. లేదంటే అంతకు ముందు జరిగిన కొన్ని యుద్ధాలే తెలుసు. సముద్ర గర్భంలోనూ ఇండియా - పాక్‌లు హోరాహోరీగా తలపడ్డాయని, ఆ యుద్ధంలో భారతీయ సైనికులు ధృఢచిత్తంతో శత్రువుల్ని ఎదుర్కొని విజయం సాధించారన్న చరిత్రకు ‘ఘాజీ’ అద్దం పట్టింది.
ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు కేవలం సబ్‌మెరైన్‌లోనే తీశారు. కంటికి సబ్‌ మెరైన్‌ తప్ప ఇంకేం కనిపించదు. అయినా సరే.. విసుగు అనిపించదు. తరవాతేం జరుగుతుందన్న ఉత్కంఠ తప్ప. మనదేశం పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందన్న సంగతి తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కానీ ‘ఎలా’ అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రాల్లో.. ప్రేక్షకుల్ని కనెక్ట్‌ చేయడం తప్పనిసరి. అప్పుడే తెరపై ప్రధాన పాత్రలు ఎంత భావోద్వేగంతో రగిలిపోతాయో.. ప్రేక్షకుల్లోనూ అలాంటి స్పందనే కలుగుతుంటుంది. ఈ విషయంలోనూ దర్శకుడు విజయం సాధించాడు. శత్రువుల నుంచి మన సబ్‌మెరైన్‌ని కాపాడుకొనే సందర్భంలో.. ఘాజీని మట్టుపెట్టినప్పుడు ప్రతి ప్రేక్షకుడూ మనసులో ‘జైహింద్‌’ అనుకోకుండా ఉండలేడేమో..?!
 
అతి తక్కువ పాత్రలతో.. ‘యుద్ధం’ అనే ఒకే లైన్‌తో రెండు గంటలు కూర్చోబెట్టడం.. పట్టుసడలని స్క్రీన్‌ప్లేతోనే సాధ్యమైంది. అక్కడక్కడ నేవీకి సంబంధించిన సాంకేతిక పదాలు ప్రేక్షకులకు అర్థం కావు. కానీ.. అవేవీ ఇబ్బందిని కలిగించవు. కథని.. తెరపై ఉన్న వాతావరణాన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఒక్కసారి వాతావరణం అలవాటైన తర్వాత.. శుభం కార్డు పడేంత వరకూ తెరపై నుంచి చూపు మరల్చకుండా చేయటంలో విజయవంతమైంది చిత్ర బృందం.
ఎవరెలా చేశారంటే..?: ఈ సినిమాలో పాత్రలు తప్ప పాత్రధారులెవ్వరూ కనిపించనట్లుగా ఉంది. రానా ఈ కథని.. ఈ పాత్రనీ ఏరికోరి ఎందుకు చేశాడో సినిమా చూస్తే అర్థమైపోతుంది. కెకె మీనన్‌ పాత్రని ప్రేమిస్తాం. అతను తెరపై ఇంకాసేపు ఉంటే బాగుణ్ణు అనుకొంటాం. తాప్సిని ఎందుకు తీసుకొన్నారో అర్థం కాదు. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఓంపురి.. నాజర్‌లవి చాలా చిన్న పాత్రలు.
కె అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. మనం కూడా నీటిలో ఉన్నామేమో అనే భావన కేవలం నేపథ్య సంగీతంతోనే కలిగించారు. మది కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న చిత్రమే అయినా... చిన్న సబ్‌మెరైన్‌ సెట్లో.. కెమెరాని పరుగులు పెట్టించాడు. సంకల్ప్‌ ఆలోచన.. అతని స్క్రీన్‌ ప్లే ‘ఘాజీ’ని ఓ మర్చిపోలేని చిత్రంగా మలిచాయి.