Monday, July 14, 2014

టెస్టు క్రికెట్‌కు మహేల గుడ్‌బై




శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేల జయవర్ధనే టెస్టు క్రికెట్‌కు త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. స్వదేశంలో ఈ నెల 16న దక్షిణాఫ్రికాతో, ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్ ఆనంతరం జయవర్ధనే టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 

           దీనికి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అశ్లే డిసిల్వాకు జయవర్ధనే(37) లేఖ రాసినట్లు లంక బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. గత 18 ఏండ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. కాని టెస్టు కెరీర్ నుంచి వైదొలగడానికి ఇది సరైన సమయం అని జయవర్ధనే పేర్కొన్నాడు. 1997లో భారత్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఈ లంక దిగ్గజ బ్యాట్స్‌మన్ 145 టెస్టుల్లో 11,493 పరుగులు చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 48 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ఇటీవలే బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంక తొలిసారి నెగ్గిన అనంతరం సహచర ఆటగాడు సంగక్కరతో కలిసి మహేల టీ20లకు గుడ్‌బై చెప్పాడు.

జర్మనీ జట్టు విజేత


 బ్రెజిల్ వేదికగా జరిగిన జర్మనీ-అర్జెంటీనా సాకర్ ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ జట్టు విజేతగా నిలిచి సాకర్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు ఎవ్వరూ ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో మరో 30 నిమిషాల అదనపు సమయానికి వెళ్లాల్సి వచ్చింది. మ్యాచ్ 113వ నిమిషంలో జర్మనీ ఆటగాడు గోట్జే గోల్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. అనంతరం మిగిలిన ఏడు నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా జట్టు గోల్ సాధించలేకపోయింది. దీంతో 1-0 ఆధిక్యంతో జర్మనీ జట్టు సాకర్ ప్రపంచ విజేతగా నిలిచింది. 

 నాలుగోసారి ప్రపంచకప్ గెలుచుకున్న జర్మనీ

             అర్జెంటీనాతో నేడు జరిగిన ఫైనల్‌మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా 24 ఏళ్ల తర్వాత జర్మనీ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. ఇప్పటివరకు జర్మనీ జట్టు నాలుగుసార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. సాకర్ ప్రపంచకప్ పోటీల్లో ఎనిమిదిసార్లు ఫైనల్‌కు చేరిన జర్మనీ జట్టు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. మరో నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 1954లో మొదటిసారి, 1974లో రెండోసారి, 1990లో మూడోసారి, 2014లో నాల్గొవసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 1966, 1982, 1986, 2002లో రన్నరప్‌గా నిలిచింది.