అదో పెద్ద కోట. ఆ కోట గోడపై పరిగెత్తడం అంటే సాహసం చేయడమే. కండల వీరుల గుండెలు దడదడలాడి పోతాయ్. ఇక, గులాబీ బాల కృతీ సనన్ వంటి భామలైతే వణికిపోతారు. ఆ వణుకుతో పరిగెత్తితే జారడం ఖాయం. అదే జరిగింది. కృతీ సనన్ ఎవరో ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. మహేశ్‌బాబుతో ‘నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీ సినిమాలకు పరిమితమయ్యారు. ప్రస్తుతం దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్న ‘రాబ్తా’ చిత్రంలో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో జతకట్టారామె. ఈ చిత్రం షూటింగ్ హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతోంది.
ఓ కోట గోడపై కృతి పరిగెత్తే సన్నివేశం తీయడానికి ప్లాన్ చేశారు. సీన్ విన్న కృతి భయపడినా, ‘చేయను’ అంటే బాగుండదు కదా... ఒప్పేసుకున్నారు. డెరైక్టర్ షాట్ రెడీ అనగానే, మనసులో భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా గోడపై పరిగెత్తసాగారామె. హఠాత్తుగా కృతి పరుగుకి బ్రేక్ పడింది. కాలు జారిందట. అయితే గోడ పైనుంచి పూర్తిగా కిందపడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ, నొప్పితో కృతి విలవిలలాడిపోయారట. పెద్ద గాయం కాకపోయినా, కాలు బెణికినందువల్ల రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట.