Monday, June 20, 2016

రక్షించడానికి పోతే.. చంపేసింది..

ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆ ఎలుగుబంటి కాళ్లకు కంచెఉచ్చు పడడంతో ఆరు గంటలపాటు మృతదేహం వద్దే ఉంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. నల్లమల అటవీ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి అటవీ జంతువులు రాకుండా ఉండేందుకు రైతులు కంచె ఏర్పాటు చే శారు.
 
గ్రామానికి చెందిన బోడ్యానాయక్(50) తన వ్యవసాయ పొలం వద్దకు సోమవారం తెల్లవారుజామున వెళ్లాడు. కంచెలో ఎలుగుబంటి చిక్కుకుంది. అయితే సదరు రైతు దానిని అడవిపంది అనుకొని వెళ్లగొట్టేందుకు దగ్గరికి వెళ్లాడు. ఎలుగుబంటి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. అటు ఎలుగుబంటి, ఇటు రైతు బోడ్యానాయక్ కంచెలో ఇరుక్కుపోయారు. ఎలుగుబంటి దాడిలో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కంచెఉచ్చులో ఇరుక్కుపోయిన ఎలుగుబంటి తప్పించుకోలేకపోయింది. బోడ్యా శరీర భాగాలను చీల్చివేసింది.

అప్పటికే అరుపులను విన్న చుట్టపక్కల రైతులు.. కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కానీ ఎవరూ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. నగరపంచాయతీ కమిషనర్ కె.తులసీరాం అటవీశాఖ, పోలీసు,రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నాగర్‌కర్నూల్ ఆర్‌డీఓ దేవేందర్‌రెడ్డి, అటవీశాఖ డీఎఫ్‌ఓ బాలస్వామి, తహసీల్దార్ ఎం.సుదర్శన్‌రెడ్డి, అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు,ఎస్‌ఐలు అనుదీప్,శ్రీధర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉచ్చులో ఉన్న ఎలుగుబంటిని బయటికి తీయడానికి హైదరాబాద్ జూపార్కుకు సమాచారం ఇచ్చారు.

అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి బయటికి వెళ్లకుండా ఉండేందుకు తాత్కాలిక వలయం ఏర్పాటు చేశారు. జూపార్కు అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఎంఏ హాకీం, అసిస్టెంట్ క్యూరేటర్ శ్రీదేవి, జేఏఓ ఎంఏ గఫార్, ఇంతియాస్, శివ, జిలానీలు వచ్చి ఎలుగుబంటికి బాణంతో మూడు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనులోకి ఎక్కించి హైదరాబాద్ జూపార్కుకు తీసికెళ్లారు. వన్యప్రాణి రక్షణ రిస్క్ టీం వచ్చి బోడ్యానాయక్ మృతదేహాన్ని బయటికి తీశారు. ఎలుగుబంటికి 4 నుంచి 5 ఏళ్ల వయస్సు ఉంటుందని, మగదిగా నిర్ధారించారు. ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరగగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆపరేషన్ పూర్తయ్యింది.

నేను డేటింగ్‌లో లేను!

బాలీవుడ్ తారలపై పుకార్లు అనేవి సర్వసాధారణం. ఎంత ఎక్కువ స్థాయిలో పుకార్లు వినిపిస్తే అంత పాపులారిటీ వస్తుందనేది అక్కడి తారలు నమ్మే సిద్ధాంతం. అయితే తాను అందుకు పూర్తిగా వ్యతిరేకమని చెబుతోంది కృతిసనన్. వివరాల్లోకి వెళితే...హీరో పంటి చిత్రంతో బాలీవుడ్ బాటపట్టిన కృతిసనన్ ప్రస్తుతం దినేష్ విజన్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రబ్తాలో నటిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్నాడు.
Kriti-Sanon
ఇటీవల తన ప్రేయసి అంకిత లోఖండేతో విడిపోవడంతో ఈ సినిమా చిత్రీకరణ సమయం నుంచి కృతిసనన్, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ల మధ్య ప్రేమాయణం మొదలైందని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్‌లో వున్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా కృతిసనన్ మాట్లాడుతూ ఇక చాలు. నాపై రూమర్‌లు ఆపండి. సహనటులతో సన్నిహితంగా వుంటే డేటింగ్‌లో వున్నామని అనవసరమైన కథనాల్ని సృష్టిస్తున్నారు. అ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. సుశాంత్, నేను మంచి స్నేహితులం అంతే. ఓ సినిమా కోసం సన్నిహితంగా మెలిగితే ఇద్దరి మధ్య ఏదో వుందని ప్రచారం మొదలుపెట్టడం విచారకరం. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు అని తెలిపింది. మహేష్‌బాబు నటించిన వన్ నేనొక్కడినే చిత్రంతో కృతిసనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.