Saturday, October 31, 2015

డ్రా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్



 దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య ఇక్కడ బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా ముగిసింది. ఇరు జట్లు ప్రాక్టీస్ లో ఆకట్టుకున్నా రెండు రోజులే  కావడంతో ఫలితం తేలలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 302 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 46/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించింది. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డివిలియర్స్(112) శతకం సాధించి ఆదుకున్నాడు. డివిలియర్స్ కు తోడుగా వికెట్ కీపర్ డేన్ విలాస్ (54)  రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరును సాధించింది. బోర్డు ప్రెసిడెంట్ ఆటగాళ్లలో శార్దూల్ థాకూర్  నాలుగు వికెట్లు సాధించగా, కులదీప్ యాదవ్, జయంత్ యాదవ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బోర్డు ప్రెసిడెంట్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. మరోసారి ఆకట్టుకున్నాడు. 90 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి జతగా చటేశ్వర పూజారా(49 నాటౌట్) ఆకట్టుకున్నాడు.

మరో టైటిల్ కు అడుగు దూరంలో...


 వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా(భారత్)- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట  6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. తొలి సెట్ లో కాస్త పోరాడిన సానియా ద్వయం.. రెండో సెట్ ను అవలీలగా చేజిక్కించుకుని మరో టైటిల్ వేటకు సన్నద్ధమైంది. ఈ తాజా గెలుపుతో సానియా జోడి తమ వరుస విజయాల సంఖ్యను 21 కు పెంచుకుంది.  
ఎనిమిది నెలల క్రితం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా అద్వితీయ ఫలితాలు సాధించింది. హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది. అందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్‌లు కూడా ఉండటం విశేషం. మరో ఒక విజయం సాధిస్తే సానియా-హింగిస్ ఖాతాలో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కూడా చేరుతుంది.

నంబర్ వన్ ర్యాంకు పదిలం

డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్  ఈ సీజన్ ముగింపు టోర్నీ కావడంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకింగ్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత ఏప్రిల్ తొలిసారి ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సానియా..  వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ సంవత్సరపు ముగింపు ర్యాంకింగ్స్ లో హింగిస్ తో కలిసి సానియా మీర్జా తన మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది.