బాలీవుడ్‌లో ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించగల నేర్పరి షారుఖ్ ఖాన్. రొమాంటిక్ హీరోగానే కాదు.. విలన్ పాత్రల్లోనూ తనలోని నటనా చాతుర్యంతో ప్రేక్షకులను అకట్టుకుంటాడు. 2006లో వచ్చిన ‘డాన్’.. 2011లో సీక్వెల్‌గా వచ్చిన ‘డాన్-2’లో షారుఖ్ నెగెటివ్ పాత్రల్లో కనిపించాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మరో నెగిటివ్ రోల్‌తో ‘ఫ్యాన్’గా థియేటర్లలోకి అడుగుపెట్టాడు. గురువారం యూఏఈలో విడుదలైన ‘ఫ్యాన్’ చిత్రం.. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రేక్షకుల్ని ఈ ‘ఫ్యాన్’ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం.
కథేంటంటే..: ఆర్యన్ ఖన్నా(షారుఖ్ ఖాన్) దేశంలోనే అత్యంత అభిమానగణం ఉన్న హీరో. 19 ఏళ్ల గౌరవ్(షారుఖ్ ఖాన్) అతనికి ప్రపంచంలోనే గొప్ప అభిమాని. విశేషమేమిటంటే.. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు కవలల్లా ఉంటారు. ముఖకవళికలు.. శరీరాకృతి.. హావభావాల్లో వీసమెత్తు తేడా కనిపించదు. ఆర్యన్ ఫొటోలు.. ఫ్లెక్సీలతో తన ఇంటినే ఓ ఆల్బమ్‌లా మార్చేస్తాడు ఆ ‘ఫ్యాన్’. ఒక్క మాటలో చెప్పాలంటే తన అభిమాన హీరోనే అతని ప్రపంచం! ఆర్యన్‌ను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు వూరుకోడు. చీల్చి చెండాడుతాడు. అంత అభిమానం మరి.
ఓ రోజు ఎలాగైనా ఆర్యన్‌ను కలవాలని ముంబయిలోని అతని ఇంటికి వెళతాడు గౌరవ్. అతన్ని చూసి ఆర్యన్ ఉద్వేగానికి గురవుతాడు. దాంతో ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. అనుకోకుండా ఆ అనుబంధం తెగిపోయి.. ఇద్దరి మధ్య వైరుధ్యం ఏర్పడుతుంది. ఆర్యన్‌కు ఉన్న మంచిపేరును చెడగొడతానని గౌరవ్ శపథం చేస్తాడు. దీంతో అప్పటి వరకూ తన అభిమాన నటుడి కోసం గౌరవ్ పడరాని పాట్లు పడగా.. ఆ తర్వాత కథ అడ్డం తిరుగుతుంది. గౌరవ్‌ను ఛేజ్ చేసేందుకు హీరో నానా తంటాలు పడతాడు. మరి చివరికి ఆ ‘ఫ్యాన్’ అన్నంత పని చేశాడా? అందుకు హీరో ఏం చేశాడు? తదితర విషయాలను తెరపైన చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: షారుఖ్ అభిమానులకు ‘ఫ్యాన్’ డబుల్ బొనాంజా అనే చెప్పొచ్చు. 19 ఏళ్ల యువకుడి పాత్రలో షారుఖ్ ఇమిడిపోయిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆర్యన్‌ను కలిసేందుకు గౌరవ్ పడే తిప్పలు.. ఆ తర్వాత ఇద్దరి మధ్య వైరుధ్యం వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సగటు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. చిత్రం మొత్తాన్ని ‘వన్ మ్యాన్ షో’గా నడిపించేశాడు షారుఖ్.
ద్వితీయార్ధంలో మాత్రం కొన్ని సన్నివేశాలు కాస్త మందకొడిగా సాగినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంతో తన రియల్ అభిమాని వలూచా డిసౌజాను వెండితెరకు పరిచయం చేశాడు షారుఖ్. ఈ చిత్రంలో షారుఖ్ సతీమణి గౌరీఖాన్‌గా నటించింది. ఇతర నటీనటులు వారి పరిధుల మేరకు మొప్పించారు.
సాంకేతికంగా..: నేపథ్య సంగీతం విషయంలో సంగీత దర్శకుడు బాగానే పని చేసినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. తర్వాతేం జరుగుతుంది? అన్న ఉత్కంఠను కలిగించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు.