తెలుగు చిత్రసీమలో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు సురేందర్‌రెడ్డి. ఆయన ఎవరితో సినిమా చేసినా సరే, ఆ కథానాయకుడు స్టైలిష్‌గా కనిపించబోతున్నాడని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు. నిజంగానే సురేందర్ రెడ్డి కథానాయకుల్ని అలా ఆవిష్కరిస్తుంటారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ సినిమాతోనూ అదే రుజువైంది. రామ్‌చరణ్ ఇన్నాళ్లూ తెరపై కనిపించింది ఒకెత్తైతే, ‘ధృవ’ సినిమాలో కనిపించింది మరో ఎత్తు అన్నట్టుగా ఆ సినిమా అభిమానుల్ని అలరిస్తోంది. విజయోత్సాహంలో ఉన్న సురేందర్ రెడ్డి తదుపరి అఖిల్ అక్కినేనితో సినిమా చేయబోతున్నాడనే ప్రచారం వూపందుకొంది. అఖిల్ ప్రస్తుతం తన రెండో చిత్రంపై దృష్టిపెట్టారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఆ తర్వాత సినిమా సురేందర్‌రెడ్డితోనే అని, సూరి స్టైలిష్ హీరోల జాబితాలో అఖిల్ కూడా చేరబోతున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు గట్టిగానే చెప్పుకొంటున్నాయి. అదంతా ఒకెత్తైతే, ఆ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మించబోతున్నారనే ప్రచారం మరో ఎత్తు. రామ్‌చరణ్, అఖిల్ మంచి స్నేహితులు. వాళ్లిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మరికొన్ని రోజులు తర్వాత ఆ చిత్రంపై స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలున్నాయి.