కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి
అశ్విత్‌రెడ్డిని సినీ హీరో అక్కినేని అఖిల్ పరామర్శించారు. మంచు లక్ష్మి
హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేట్ టీవీ చానల్ ద్వారా అశ్విత్‌రెడ్డి
దుస్థితిని తెలుసుకున్న అఖిల్ మంగళవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా
అశ్విత్‌రెడ్డి వైద్యానికి అవసరమయ్యే డబ్బు కోసం ఆటో నడిపి కొంత మొత్తం
సేకరించారు. నగరంలోని నర్సింహస్వామి దేవాలయం రోడ్డులో ఉంటున్న కట్టూరి
కృష్ణారెడ్డి, కవితలకు కుమారుడు అశ్విత్‌రెడ్డి, కుమార్తె అనుషిత ఉన్నారు. రెండు నెలల క్రితం అశ్విత్ డెంగీ జ్వరం బారినపడటంతో వైద్య పరీక్షలు
చేయించారు. ఆ సమయంలో అతనికి రెండు మూత్రపిండాలు పాడైనట్లు వైద్యులు
తెలిపారు. వైద్యం కోసం ఆస్తి, బంగారం అమ్మి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు.
కిడ్నీ మార్పిడికి రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు.
అంతమొత్తం వెచ్చించే స్థోమత అశ్విత్‌రెడ్డి తల్లిదండ్రులకు లేదు. ఈ
నేపథ్యంలో టీవీ చానల్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న అఖిల్ ఖమ్మం వచ్చి ఆటో
నడిపి డబ్బులు సేకరించి ఇచ్చాడు.