గడచిన కొన్ని నెలలుగా తెలుగు పరిశ్రమనూ, ప్రేక్షకులనూ వెంటాడుతున్న ప్రశ్న ఒకటి ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. యస్.. మీరు ఊహించినది కరెక్టే. ‘అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అన్నదే ఆ ప్రశ్న. వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే వరకూ రాజమౌళి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేట్లు లేరు. ఇక... ఉగాది సందర్భంగా మొదలైన రెండో ప్రశ్న మరొకటి. దానికి మాత్రం సమాధానం దొరికిపోయిందోచ్. మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి సమర్పణలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ లుక్ ఉగాది సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే.
మామూలుగా ఏ స్టార్ హీరో ఫస్ట్ లుక్ విడుదలైనా దాని గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక... ఈ పోస్టర్ అయితే మరింత చర్చనీయాంశమైంది. కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు మహేశ్‌బాబు చెప్పులు తొడుగుతున్న ఆ కాళ్లు ఎవరివి? అని చాలామంది తలబద్దలు కొట్టుకున్నంత పని చేశారు. ఆ చిత్రంలో కీలకపాత్రలు చేస్తున్న నటులందరి పేర్లూ అనుకుని చూశారు. ప్చ్.. సమాధానం దొరకలేదు. ఇంతకీ ఆ కాళ్లు ఎవరివో తెలుసా? నటుడు సత్యరాజ్‌వి. ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్‌బాబు తండ్రిగా నటిస్తున్నారాయన. విశేషం ఏంటంటే.. అటు మొదటి ప్రశ్న ‘బాహు బలి’లోనూ, ఇటు రెండో ప్రశ్న ‘బ్రహ్మోత్సవం’లోనూ కామన్‌గా ఉన్నది సత్యరాజ్ కావడం.