Wednesday, June 8, 2016

‘ఆషిఖీ-3’లో అన్నీ నేనే పాడుతా!

 మహేశ్‌భట్‌ వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఆలియాభట్‌. విభిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. రొమాంటిక్‌ చిత్రం ‘ఆషిఖీ 3’లో ఈ భామ నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆలియా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
ఎలాంటి అంచనాలు లేకుండా 2013లో వచ్చిన ‘ఆషిఖీ 2’ రొమాంటిక్‌ మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. అందులోని ప్రతి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదేస్థాయిలో ‘ఆషిఖీ 3’ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మోహిత్‌ సూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో అన్ని పాటలు తానే పాడనున్నట్లు ఆలియాభట్‌ తెలిపింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని చెప్పిన ఈ అమ్మడు... సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లనుందో మాత్రం తెలియదంటోంది.

స్టెప్పులు అదిరిపోతాయ్‌

 ఎన్టీఆర్‌ డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకొని మరీ బరిలో దిగాడేమో, ఎలాంటి భంగిమనైనా చిటికెలో చేసేస్తాడు. మెరుపు కంటే వేగంగా కాలు కదుపుతాడు. ఈసారి ‘జనతా గ్యారేజ్‌’లోనూ అలాంటి స్టెప్పులతోనే అదరగొట్టబోతున్నాడట. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. సమంత, నిత్యమేనన్‌ కథానాయికలు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం నుంచి ఎన్టీఆర్‌, సమంతపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తారు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ గీతానికి శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ పాట కోసం కళా దర్శకుడు ప్రకాష్‌ ఆధ్వర్యంలో నాలుగు సెట్లు వేశారు. ‘‘డ్యాన్సుల విషయంలో ఎన్టీఆర్‌ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు. ప్రతి పాటలోనూ కొత్తదనం చూపిస్తారు. అయితే ఓ పాట మాత్రం మాస్‌ అభిమానుల్ని అలరించే విధంగా ఉంటుంది. ఈ పాట అదే. ఈ సినిమాలో ఈ పాట చాలా ప్రత్యేకం. దానికి తగ్గట్టు ఎన్టీఆర్‌ డ్యాన్సులు కూడా అదిరిపోతాయ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

నచ్చితే కొనేస్తా!

కథానాయికగా త్వరలో కాజల్ అగర్వాల్ పదేళ్లు పూర్తి చేసుకోనున్నారు. హీరోయిన్లు ఇన్నేళ్లు కొనసాగడం అంటే మాటలు కాదు. పైగా ఇంకా బిజీగా ఉండటం అంటే చిన్న విషయం కాదు. ఏంటా సీక్రెట్? అనే ప్రశ్న కాజల్ అగర్వాల్ ముందుంచితే - ‘‘సినిమా సినిమాకీ నటిగా ఇంప్రూవ్ అవుతుంటాను. కొత్త కొత్త పాత్రలు సెలక్ట్ చేసుకుంటుంటాను. అన్నింటికన్నా మించి సక్సెస్‌ని నెత్తికెక్కించుకోను. కష్టపడటానికి వెనకాడను’’ అన్నారు. ఒకవైపు సినిమాలు చేయడంతో పాటు మరోవైపు కొన్ని బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నారామె.
మరి... డ్రెస్సుల విషయంలో మీరు బ్రాండ్‌కి ప్రాధాన్యం ఇస్తారా? అని కాజల్‌ని అడిగితే - ‘‘బ్రాండ్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నట్లే.. నేను స్ట్రీట్ ఫుడ్ కూడా తింటుంటాను. బట్టలకు కూడా దీన్ని ఆపాదించొచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌తో పాటు చిన్న చిన్న షాఫుల్లో, స్ట్రీట్ సైడ్ కూడా కొంటాను. వాటిని బ్రాండెడ్ డ్రెస్సులతో మ్యాచ్ చేసి, వేసుకుంటా. ఏది కొన్నా నాకు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటా’’ అని చెప్పారు.

అప్పుడు ఇష్టం... ఇప్పుడు అయిష్టం!


రియల్ లైఫ్ లవర్స్ జంటగా నటిస్తే, రీల్‌పై వాళ్ల కెమిస్ట్రీ అదిరిపోతుంది. అందుకు ఓ ఉదాహరణ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్. ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నప్పుడు చేసిన ‘అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ’లో రొమాంటిక్ సీన్స్‌లో జీవించారు. అప్పుడు ఇలాంటి సీన్స్‌లో ఇష్టంగా నటించిన ఈ జంట ఇప్పుడు మాత్రం అయిష్టంగా ఉన్నారట. విడిపోయాక ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘జగ్గా జాసూస్’. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అంగీకరించినప్పుడు రణబీర్, కత్రినా ప్రేమలోనే ఉన్నారు. షూటింగ్ కాస్త అయ్యాక విడిపోయారు.               దాంతో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి ఇష్టపడటంలేదట. మామూలుగా రిస్కీ ఫైట్ సీన్స్‌ని డూప్స్‌తో చేయిస్తారని అందరికీ తెలుసు. కానీ, ఈ చిత్రంలోని రొమాంటిక్ సీన్స్‌ని డూప్‌తో తీస్తున్నారట. రణబీర్, కత్రినా ఈ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడకపోవడంతో, చేసేదేం లేక ఈ విధంగా నకిలీలతో కానిచ్చేస్తున్నారట.                    ఒకవేళ నకిలీలు కనుక కెమిస్ట్రీ పండిస్తే.. అప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఆ సంగతలా ఉంచితే.. దీపికా పదుకొనే నుంచి విడిపోయాక ఆమెతో కలిసి రణబీర్ నటించారు. మరి.. ఇప్పుడు కత్రినా విషయంలో ఈ చాక్లెట్ బోయ్ ఎందుకు అంత పట్టుబడుతున్నారో? అలాగే.. సినిమా కోసం కూడా రణబీర్‌తో రొమాన్స్ నటించడానికి కత్రినా ఎందుకు అంత ఇదవుతున్నారో?.. బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది.