Tuesday, November 8, 2016

అతడి సంపాదన.. వారానికి రూ. 3 కోట్లు!

  స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పేరు చెబితే చాలు.. సాకర్ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతారు. అలాంటి రొనాల్డోకు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో అతడికి ఐదేళ్ల కాంట్రాక్టు కుదిరింది. మరో పదేళ్ల పాటు తాను ఆడుతూనే ఉంటానని ఒప్పందం సందర్భంగా అతడు చెప్పాడు. దీని ప్రకారం అతడికి అక్కడ వారానికి దాదాపు రూ. 3 కోట్లకు పైగా చెల్లిస్తారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో నిలిచిపోతాడు. తన జీవితంలో మిగిలిన కాలమంతా తాను ఆటను ఎంజాయ్ చేస్తూనే ఉంటానని.. మరో పదేళ్ల పాటు ఆడతానని స్పష్టం చేశాడు. ఈ కాంట్రాక్టుతో.. సంపాదన విషయంలో బార్సిలోనా ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ కంటే అగ్రస్థానంలోకి రొనాల్డో దూసుకెళ్లాడు. 
 
'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' టైటిల్‌ను ఇప్పటికి మూడుసార్లు గెలుచుకున్న రొనాల్డో.. ఈ ఏడాది కూడా చాలా విజయాలు సాధించాడు. అతడి పెనాల్టీ షూటవుట్ షాట్‌తో మాడ్రిడ్ 11వ సారి చాంపియన్స్ లీగ్‌ను గెలుచుకుంది. అంతకుముందు యూరో 2016ను పోర్చుగల్ గెలుచుకోవడంలో కూడా రొనాల్డోదే కీలక పాత్ర. ఇటీవలి కాలంలో రియల్ మాడ్రిడ్ కాంట్రాక్టులను పునరుద్ధరించుకున్నవాళ్లలో రొనాల్డో లేటెస్ట్ స్టార్ అయ్యాడు. అతడి కంటే ముందు  గరెత్ బేల్, లుకా మాడ్రిక్, టోనీ క్రూస్ కూడా మంచి ఆకర్షణీయమైన కాంట్రాక్టులే పొందినట్లు సమాచారం.
 
రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి మాడ్రిడ్‌కు మారిన తర్వాత 8 సీజన్లలో 360 గేమ్స్ ఆడి 371 గోల్స్ సాధించాడు. ఈ క్లబ్‌లో ఇంతవరకు ఎవరూ చేయనన్ని గోల్స్ చేయడంతో 2009లోనే రికార్డు స్థాయి ఫీజు పొందాడు. ఇక ముందు ఎవరు ఏం చెప్పాలన్నా.. రొనాల్డో కంటే ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని మాడ్రిడ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెజ్ వ్యాఖ్యానించారు. రొనాల్డోను ప్రశంసల్లో ముంచెత్తారు.