Thursday, May 5, 2016

రివ్యూ.. సుప్రీమ్‌



 ‘పిల్లా నువ్వులేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రాలతో తనని తాను నిరూపించుకొన్నాడు సాయిధరమ్‌ తేజ్‌. డ్యాన్సుల్లో.. ఫైటింగ్‌లలో తనదైన ముద్ర వేశాడు. మేనమామలైన చిరంజీవి.. పవన్‌కల్యాణ్‌లను అనుకరించడం సరేసరి. దాంతో సాయి సినిమా అంటే ఆసక్తి మొదలైంది. ఆ జోరుకి ‘పటాస్‌’తో ఆకట్టుకొన్న అనిల్‌ రావిపూడి తోడయ్యాడు. దీంతో ‘సుప్రీమ్‌’పై అంచనాలు పెరిగేలా చేశాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం ఎంత వరకూ అందుకుందో చూస్తే..
 కథేంటి?: బాలు (సాయిధరమ్‌తేజ్‌) ఓ టాక్సీ డ్రైవర్‌. అతగాడి టాక్సీ పేరు సుప్రీమ్‌. నాన్నంటే (రాజేంద్రప్రసాద్‌) ప్రాణం. కానీ ఆయనేమో తాగుడుకి బానిస. బెల్లం శ్రీదేవి (రాశీఖన్నా) ఓ ఎస్సై. ఆమె బిల్డప్పులకు బాలు ఇట్టే పడిపోతాడు. ప్రేమించమంటూ వెంటపడతాడు. ఈలోగా బాలుకి రాజన్‌ అనే ఓ చిన్న కుర్రాడు పరిచయమవుతాడు. అతనో అనాధ. రాజన్‌ మాటలు.. చేష్టలు బాలుకి తెగ నచ్చేస్తాయి. దాంతో ఇంటికి తీసుకెళ్తాడు.
కాలక్రమంలో రాజన్‌ ఆ ఇంట్లో భాగమైపోతాడు. అయితే.. రాజన్‌ని వెదుక్కొంటూ ఓ ముఠా తిరుగుతుంటుంది. రాజన్‌పై పదిహేను వందల మంది ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంటారు. వాళ్లంతా ఎవరు? రాజన్‌ని వారందరూ ఎందుకు వెదుకుతున్నారు? అసలు రాజన్‌కి వచ్చిన సమస్యేంటి? బాలు ఆ సమస్యను పరిష్కరించాడా? లాంటి పశ్నలకు సమాధానం తెలియాలంటే ‘సుప్రీమ్‌’ను వెండితెర మీద చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: తొలి సినిమా ‘పటాస్‌’తోనే తన పంథా చాటుకొన్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. కథపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా సరే.. వినోదంతో కాలక్షేపం చేయించే సత్తా అనిల్‌లో ఉందన్న విషయం తొలి సినిమాతోనే అర్థమైంది. ‘సుప్రీమ్‌’కీ అదే ఫాలో అయిపోయాడు. ప్రేక్షకులకు కావాల్సినవి పంచుకొంటూ వెళ్లాడు. కథలో విషయం లేదని తెలుస్తున్నా.. కామెడీ సన్నివేశాలతో సినిమాని నడిపించేశాడు.
వెన్నెల కిషోర్‌తో పోలీస్‌ స్టేషన్‌లో చేసిన కామెడీ ఆకట్టుకుంటుంది. బెల్లం శ్రీదేవి ఇంట్లో పాయసం చుట్టూ అల్లిన సన్నివేశం.. ఓ పాత్ర ‘కాఫీ.. కాఫీ’ అంటూ ఆ ఒక్క మాటతో ఇంట్లోవాళ్లని సతాయించడం, రఘుబాబు కామెడీ టైమింగ్‌లు పండాయి. దీంతో తొలి అర్థభాగం టైమ్‌ పాస్‌ అయిపోతుంది.
చిక్కంతా సెకండ్‌ హాఫ్‌తోనే. కథేంటో అప్పటికే తెలిసిపోతుంది. అది ఎక్కడ ఆగుతుందో అర్థమైపోతుంది. కాబట్టి.. సన్నివేశాల్ని ఆసక్తిగా రాసుకోవాల్సింది. కానీ అది సరిగా జరగలేదనిపిస్తుంది. తొలి భాగం పండిన వినోదం సెకండాఫ్‌లో మాయమైంది. కేవలం చైల్డ్‌ సెంటిమెంట్‌తోనే నడిపించే ప్రయత్నం జరిగింది. పోరాట ఘట్టాలు.. ఛేజింగులు ఎక్కువయ్యాయి. చివర్లో దివ్యాంగుల పోరాట సన్నివేశం ఒక్కటే.. కొత్తగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ మామూలే.