Monday, May 23, 2016

మహేష్ ను మోసం చేసిన దర్శకులు!

 ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క హిట్ ఇచ్చిన కాంబినేషన్ లో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. స్టార్ హీరోలు కూడా సక్సెస్ ఇచ్చిన దర్శకులతో కలిసి పనిచేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే బాటలో తనకు ఒక హిట్ సినిమా ఇచ్చిన దర్శకులకు సెకండ్ చాన్స్ ఇచ్చి చూశాడు. కానీ మహేష్ సెకండ్ చాన్స్ ఇచ్చిన దర్శకులందరూ నెగెటివ్ రిజల్ట్ తో మహేష్ కు షాక్ ఇచ్చారు.
ఒక్కడు సినిమాతో మహేష్ కు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకుడు గుణశేఖర్. అదే కృతజ్ఞతతో తరువాత అర్జున్, సైనికుడు సినిమాలు గుణ డైరెక్షన్లో  చేశాడు మహేష్. కానీ ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మహేష్ కెరీర్ లో మరో మెమరబుల్ మూవీ అతడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ రావటంతో అదే కాంబినేషన్ లో ఖలేజా సినిమా చేశాడు, ఆ సినిమా డిజాస్టర్ టాక్ తో నిరాశ పరిచింది.

రీసెంట్ గా శ్రీను వైట్ల కూడా ఇలాంటి అనుభవాన్నే మిగిల్చాడు. దూకుడు సినిమాతో మహేష్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన శ్రీను, తరువాత ఆగడు సినిమాతో అదే స్థాయి ఫ్లాప్ ఇచ్చాడు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల విషయంలో కూడా అదే నిజమైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కూల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచాడు.

అయితే ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్. మహేష్ తో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పూరి, తరువాత బిజినెస్ మేన్ సినిమాతో మరో హిట్ అందించాడు.

తొలిరోజు యావరేజ్‌ కలెక్షన్లే!


ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఐశ్యర్యరాయ్‌ తాజా చిత్రం 'సరబ్‌జిత్‌' తొలిరోజు కలెక్షన్ల విషయంలో తుస్సుమంది. పాకిస్థాన్‌ జైలులో మగ్గి.. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచిన సరబ్‌జిత్‌ సింగ్ జీవితకథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ కుమార్ తీసిన మరో బయోపిక్‌ 'సరబ్‌జిత్‌'. ఆయన గతంలో ప్రియాంకచోప్రాతో తెరకెక్కించిన 'మేరికోమ్‌' సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
ఈ నేపథ్యంలో రణ్‌దీప్‌ హుడా సరబ్‌జిత్‌గా, ఐశ్యర్యరాయ్‌ ఆయన సోదరిగా ఎమోషనల్‌ డ్రామాగా 'సరబ్‌జిత్‌' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా కథపరంగా, ప్రధాన పాత్రల నటనపరంగా ఈ సినిమా ప్రేక్షకులను కదిలింపజేస్తోంది. పాజిటివ్‌ మౌత్‌టాక్‌ వచ్చినప్పటికీ తొలిరోజు 'సరబ్‌జిత్‌' సినిమా కేవలం రూ. 3.69 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్‌లో మిగతా రెండు రోజుల్లో వచ్చే కలెక్షన్లు ఈ చిత్రానికి కీలకం కానున్నాయి. ఈ సినిమా హిట్టా.. ఫట్టా అన్నది ఇక ప్రేక్షకుల చేతుల్లోనే ఉన్నది.  

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదట!


  హండ్రెడ్ పర్సంట్ అందంగా ఎవరూ ఉండరు. ఏదో చిన్న లోపం అయినా ఉంటుంది. అలాంటి లోపాలను సరిచేయడానికి ప్లాస్టిక్ సర్జరీ ఉంటుంది. అనుష్కా శర్మ తన పెదాలకు అదే చేయించారనే టాక్ విస్తృతంగా ప్రచారమవుతోంది. ఆ మధ్య ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఆమె తన లిప్స్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పుకుంటున్నారు. తీరా అది వికటించడంతో ఆమె పెదాలు మునుపటికన్నా అందవిహీనంగా తయారయ్యాయని మాట్లాడుకుంటున్నారు.  కొన్నాళ్లుగా ఈ వార్తలకు స్పందించని అనుష్క సడన్‌గా ఓ కార్యక్రమంలో ఈ ప్రశ్న అడిగేసరికి అగ్గి మీద గుగ్గిలమయ్యారు.

‘‘నా పెదవులకు కత్తెర పడాల్సిన పని లేదు. ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఓ స్పెషల్ టూల్ సాయంతో నా పెదవులకు మేకప్ వేశారంతే. అంతకు మించి ఎటువంటి సర్జరీ జరగలేదు. ఇలాంటి విషయాలు మళ్లీ నా దగ్గర ఎత్తకండి’’ అని  కాస్త ఘాటుగానే స్పందించారు అనుష్క. అందాల తార ఇలా విరుచుకుపడటంతో అడిగినవాళ్లు సెలైంట్ అయిపోయారట.