Wednesday, April 6, 2016

‘సర్దార్ గబ్బర్ సింగ్’ లీకైంది..!

పొద్దుటూరులో సీడీ షాపులపై పోలీసుల దాడులు
పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు



  విడుదల కంటే ముందే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం లీకైందంటూ పుకార్లు వినిపించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం ఉదయం నుంచి దాడులు చేశారు. పవన్‌కల్యాణ్ నటించిన సర్దార్‌గబ్బర్‌సింగ్ ఈనెల 8న విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి  సంబంధించిన సీడీలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందింది. దీంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సీడీ షాపులు, తయారీ దారులపై పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ చిత్రానికి పని చేసిన కొందరు టెక్నీషియన్ లు రెండు రోజుల క్రితం ల్యాబ్ నుంచి కాపీ చేసుకున్నట్లు పుకార్లు వినిపించాయి. ప్రొద్దుటూరులోని  పలు సీడీ షాపులలో పోలీసులు సోదాలు చేశారు. సీడీలను తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న దుకాణాలపై కూడా దాడి చేసి హార్డ్ డిస్క్‌లు, సీడీ రైటర్‌లను పరిశీలించారు. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరిని, త్రీ టౌన్ పరిధిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు వారిని బైండోవర్  చేసి తహ సీల్దార్ వద్ద హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులను చిత్రం విడుదల అయ్యే వరకూ ప్రతి రోజూ స్టేషన్‌లో హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. అయితే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన  సీడీలు ఎవరి వద్ద దొరకలేదని పోలీసులు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు థియేటర్ యజమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రజల కంటే ఐపీఎల్‌ క్రికెట్‌ ముఖ్యమా?

బీసీసీఐని నిలదీసిన బాంబే హైకోర్టు
మహారాష్ట్ర ప్రజల కంటే ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ ముఖ్యమా? అని బాంబే హైకోర్టు బుధవారం బీసీసీఐని నిలదీసింది. మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో ఏప్రిల్‌ 9నుంచి మే 29 వరకు మొత్తం 20 క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించవలసి ఉంది. క్రికెట్‌ పిచ్‌లను ఒక సారి తడిపేందుకు సుమారు 60 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. మహారాష్ట్రలో రాజధాని ముంబయితో సహా పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అందువల్ల క్రికెట్‌ మ్యాచ్‌లను నీటి ఎద్దడి లేని రాష్ట్రాల్లో నిర్వహించుకోవాలని బీసీసీఐకి హైకోర్టు సూచించింది. నీటి ఎద్దడి సమస్యకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండగా, పిచ్‌లను తడపడానికి నీటిని వృధా చేస్తే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాకుండా ఇక్కడ తాగునీటి ఎద్దడి ఉన్న విషయం మీకు తెలియదా? అని కూడా ప్రశ్నించింది. 2015లో అనావృష్టి వల్ల 3,228 మంది ఆత్మహత్య కు పాల్పడ్డారని జర్నలిస్టు తిరోడ్కర్‌ హైకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల బీసీసీఐ వినియోగించే ప్రతి నీటి బొట్టుకు పైసలు వసూలు చేయాలని ఆయన కోరారు. విలువైన నీరు వృధా చేయకుండా సంబంధిత సంస్థలకు ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. మహారాష్ట్రలో ఐపీఎల్‌ క్రికెట్‌ నిర్వహణ వల్ల చాలా నీరు వృధా అవుతుందని 'లోక్‌సత్తా మూవ్‌మెంట్‌' అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. కాగా దీనిపై బీసీసీఐ వాదన మరోలా ఉంది. తాము తాగునీరు కాకుండా ఇతర నీటిని పిచ్‌లను తడిపేందుకు ఉపయోగిస్తున్నామని ఆ సంస్థ నిర్వహకులు చెబుతున్నారు. నాగపూర్‌, పుణే, ముంబయి నగరాల్లో క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి టికెట్లను అమ్మేశామని, ఇప్పుడు వీటిని రద్దు చేస్తే చాలా నష్టపోతామని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా ఆవేదన వ్యక్తం చేశారు.

రీ ఎంట్రీకి రెడీ అవుతోన్న టాలీవుడ్ స్టార్ హీరో ..

  బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. లాంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్, తరువాత ఆ సక్సెస్ ను కొనసాగించలేకపోయాడు. వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ సిద్ధూ టాలీవుడ్ వదిలేసి చెన్నై వెళ్లిపోయాడు. అక్కడ కూడా మంచి సక్సెస్ లు రాకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్న సిద్ధార్థ్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్టిపెట్టాడు.
              చందమామ కథలు సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఇటీవల గుంటూరు టాకీస్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆర్ట్ సినిమాలే కాదు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలనని ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ ను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే సిద్దూకి కథ కూడా చెప్పి ఒప్పించిన ప్రవీణ్, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు.