Friday, January 25, 2019

గోవా బీచుల్లో మద్యపాన నిషేధం



 ఇకపై గోవా బీచుల్లో బహిరంగంగా మద్యం సేవించినా, వంటలు వండినా రూ.2000ల జరిమానా విధించనున్నారు. ఇందుకోసం అక్కడి రాష్ట్రప్రభుత్వం పర్యాటక చట్టాల్లో చేసిన మార్పులకు కేబినెట్‌ గురువారం ఆమోదముద్ర వేసింది. దీనిపై గోవా పర్యటకశాఖ మంత్రి మనోహర్‌ అజ్గోంకర్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లును జనవరి 29 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదిస్తామని పేర్కొన్నారు. గోవాకు వచ్చే పర్యాటకుల్లో కొద్దిమంది పగిలిన మద్యం సీసాల్ని బీచ్‌లో విసురుతున్నారని, అక్కడే వంటలు కూడా వండుతున్నారని చెప్పారు. దీనిని నిషేధించే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పారు. ఇకపై బీచుల్లో బహిరంగంగా మద్యం సేవించడం నిషేధిస్తామని, అక్కడికి మద్యం సీసాలు తీసుకెళ్లేందుకు కూడా అనుమతించమని చెప్పారు. బహిరంగంగా వంటలు వండటాన్ని కూడా నిషేధిస్తున్నామని, ఒక వేళ ఎవరైనా అతిక్రమణలకు పాల్పడితే రూ.2000 జరిమానా విధిస్తామన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో వారిని అదుపులోకి తీసుకొని మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. బృందాలుగా ఈ నిబంధనలను అతిక్రమించే వారికి రూ.10వేల వరకూ జరిమానా ఉంటుందని చెప్పారు. ఇటీవలి కాలంలో గోవాలో బీచ్‌ల నిర్వహణ సరిగాలేదని పర్యటక ప్రతినిధులు కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నూతన చట్టం అమల్లోకి వచ్చాక ప్రత్యేకంగా ఓ వాట్సప్‌ నెంబరు ద్వారా అతిక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించి, 12 గంటల్లోగా వారిపై చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి అజ్గోంకర్‌ తెలిపారు.