Monday, October 17, 2016

విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరు?


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరు? (ఎ) ప్రియాంక చోప్రా (బి) అనుష్క శర్మ (సి) దీపికా పదుకోన్ (డి) తెలియదు. ఇంతకీ ఈ ప్రశ్న ఏంటని వింతగా ఉందా? మహారాష్ట్రలోని భివండి హైస్కూల్ ఉపాధ్యాయుల లీల ఇది.
తొమ్మిదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన పీటీ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న ఉంది. ఇది చూసి విద్యార్థులు షాకయ్యారు. ఈ విషయం స్థానిక మీడియాలో రావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. విరాట్ కోహ్లీ గాళ్ ఫ్రెండ్ ఎవరయితే విద్యార్థులకు ఏంటి? ఇది కోహ్లీ వ్యక్తిగత విషయం.. ఫిజికల్ ట్రైనింగ్ పరీక్షకు, ఈ ప్రశ్నకు ఏమైనా సంబంధముందా? అంటూ విమర్శలు గుప్పించారు. విరాట్ నటి అనుష్క శర్మతో డేటింగ్ చేస్తుండటం ఆయన వ్యక్తిగత విషయం.. ఈ విషయాన్ని పరీక్షల్లో ఎలా అడుగుతారని మండిపడ్డారు.

గత నెలలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ కు సంబంధించిన ప్రశ్న పరీక్షలో రావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తమిళనాడులో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు సినిమా తెలివితేటలను పరీక్షించారు. వేలూరు ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ పరీక్షలో బాహుబలి సినిమాకు సంబంధించిన ప్రశ్న కనిపించింది. విద్యాశాఖ అధికారుల తీరు చూస్తుంటే మార్కుల కోసం పాఠ్యాంశాలతో పాటు క్రికెట్, సినిమాలు, ఎఫైర్ల గురించి తెలుసుకోవాలేమో అనే సందేహం విద్యార్థులకు రాకమానదు.