Saturday, April 2, 2016

నీదా.. నాదా ..

వెస్టిండీస్‌ × ఇంగ్లాండ్‌
టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు
రాత్రి 7 గంటల నుంచి డీడీ, స్టార్‌స్పోర్ట్స్‌లో



తిరుగులేని ఫామ్‌, అంతులేని ఆత్మవిశ్వాసం, రెట్టించిన ఉత్సాహంతో విండీస్‌ ఓ వైపు.. అంచనాలను తలకిందులూ చేస్తూ సాగిన తన ప్రస్థా´నాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్‌ మరోవైపు. ఆఖరి పోరాటానికి వేళైంది! ఈడెన్‌ గార్డెన్స్‌ ముస్తాబైంది. ఆతిథ్య భారత్‌ సహా ఫేవరెట్లుగా బరిలోకి దిగిన హేమాహేమీ జట్లను అద్భుత ప్రదర్శనలతో వెనక్కి నెట్టిన ఈ రెండు సంచలన జట్ల మధ్య పొట్టి ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే. ఎవరి అవకాశాలనూ కొట్టిపారేయలేం. ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. రెండూ రెండే. రెండూ బలమైనవే. అంతరం తక్కువ. బలమైన హిట్టర్లతో, పదునైన బౌలర్లతో కదనోత్సాహంతో ఉన్న ఇంగ్లిష్‌, కరీబియన్‌ సైన్యాల మధ్య రసవత్తర సమరం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం.. కోల్‌కతాలో కప్పు ముద్దాడేదెవరో!
కోల్‌కతా
టీ20 ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ల తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఫైనల్లో వెస్టిండీస్‌ జట్టు ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. మెరుపు వీరులతో విండీస్‌ జోరు మీదుంటే.. అదిరే ఆటతో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పనికిరాదన్న ముద్రను చెరిపేసుకుంటోంది ఇంగ్లాండ్‌. అందుకే క్రికెట్‌ అభిమానులంతా ఈడెన్‌ వైపు చూ స్తున్నారు. ఫైనల్లో ఏ జట్టు గెలిచినా రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ సాధించిన తొలి జట్టుగా అవతరిస్తుంది.


  ఆసీస్‌ను విండీస్‌ నిలువరించేనా!
నేడే మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌
మధ్యాహ్నం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌-1, 3లో

ఒకరు వరుసగా మూడుసార్లు విజేతలు.. మరొకరు ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి! వీరిద్దరిలో గెలిచేదెవరు? ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేదెవరు? మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌ దృశ్యమిది. ఆదివారం జరిగే టోర్నీ తుది సమరంలో మూడుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియా.. జోరు మీదున్న వెస్టిండీస్‌ను ఎదుర్కోనుంది. మెగ్‌ లానింగ్‌ సారథ్యంలోని ఆసీస్‌.. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. అస్‌బౌర్న్‌, పెర్రీ, బ్లాక్‌వెల్‌లపై ఆసీస్‌ ఎక్కువగా ఆధారపడుతోంది. మరోవైపు స్టెఫానీ టేలర్‌ నేతృత్వంలోని విండీస్‌ జట్టు కూడా గెలుపుపై ధీమాగా ఉంది. ఇప్పటిదాకా 8 టీ20ల్లో విండీస్‌పై ఆసీస్‌దే గెలుపు.   

ఆమెకు... 70 లక్షల మంది ఫాలోవర్స్‌

 బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా ట్విట్టర్‌ ఖాతాలో 70 లక్షల మంది అభిమానులు చేరారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అంతేకాదు తన ట్విట్టర్‌ ఖాతాను 7 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నందుకు తెగ సంబర పడిపోతూ... ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ‘నన్ను ఫాలో చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీరంతా కలిసి నా ట్విట్టర్‌ కుటుంబాన్ని 7 మిలియన్లకు చేర్చారు, అద్భుతం’ అంటూ ట్వీట్‌ చేశారు. సోనాక్షి నటిస్తున్న ‘అకిర’, ‘ఫోర్స్‌ 2’ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్నాయి.