మహేశ్‌బాబుతో మూడో సినిమా కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ ‘జన గణ మణ’ అనే టైటిల్ ఎప్పుడో రిజిస్టర్ చేయించారు. మహేశ్-పూరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’.. రెండూ హిట్టే. దాంతో ‘జన గణ మణ’ ప్రకటించినప్పట్నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన పనులు చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్‌తో సినిమా కోసం కూడా పూరి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌తో ఆయన తీసిన ‘ఆంధ్రావాలా’ ఆశించిన విజయం ఇవ్వలేదు.
కానీ, ఎన్టీఆర్-పూరిలు ‘టెంపర్’తో టార్గెట్ రీచ్ అయ్యారు. పూరి మార్క్ హీరోయిజంలో ఎన్టీఆర్ యాక్టింగ్ ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇజం’ విడుదలకు సిద్ధమైంది.
ఈ నెల 5న ఆడియో, 20న సినిమా రిలీజ్. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు, ఎన్టీఆర్.. ఇద్దరితోనూ తదుపరి సినిమాలు చేయబోతున్నట్టు ఆదివారం పూరి చెప్పారు. ముందు ఎవరితో చేస్తారు? అనేది ఇక్కడి ప్రశ్న. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివ లైన్‌లో ఉన్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత చిన్న ఎన్టీఆర్ మరో సినిమా అంగీకరించలేదు. సో, ముందు మొదలయ్యేది ఎన్టీఆర్ సినిమానేనా? వెయిట్ అండ్ సీ!