విరాట్ కోహ్లి కెరీర్ మంచి జోరుమీద ఉంది. అటు మైదానంలోనూ, అటు వ్యక్తిగత
జీవితంలోనూ అతను దూసుకుపోతున్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్
కెప్టెన్‌గా దూకుడు మీదున్న కోహ్లి తాజాగా టీ-20లో సెంచరీ కూడా కొట్టాడు.
క్రికెట్‌లో అసాధారణమైన పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్న కోహ్లి వ్యక్తిగత
జీవితంలోనూ హ్యాపీగా కనిపిస్తున్నాడు. గతంలో బ్రేకప్ చేసుకున్నట్టు
భావిస్తున్న కోహ్లి-అనుష్క శర్మ మళ్లీ ఒక్కటైనట్టు వార్తలు వచ్చాయి. ఇటీవల
ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఈ ప్రేమజంట డిన్నర్ చేస్తూ కనబడింది.
ఈ నేపథ్యంలో కోహ్లి సోమవారం ముంబైలో తన అభిమానులతో పిచ్చాపాటిగా
ముచ్చటించాడు. ఈ సందర్భంగా మీరు మీ ప్రియురాలు అనుష్క శర్మతో మళ్లీ
కలిసిపోయారా? ఒకరు ప్రశ్నించగా.. 'అదిమాత్రం ఎవరికీ తెలియకూడదు. ఆ విషయంపై
నేనేమీ మాట్లాడను' అంటూ దాటవేశారు. దీంతో ఓ మహిళా జర్నలిస్టు 'మీ వ్యక్తిగత
జీవితం ఎలా సాగుతుంది' అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో కనుబొమ్మలు ముడేసిన
కోహ్లి 'నా వ్యక్తిగత జీవితం గురించి కొంతవరకు తెలుసుకొనేందుకు ఫ్యాన్స్‌కు
అవకాశముందని చెప్పాను. దానర్థం నా వ్యక్తిగత జీవితం గురించి ప్రతి
విషయాన్ని చెప్తానని కాదు' అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు.