మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తాను అదృష్టం
బాగుండి బతికిపోయానని.. లేకపోతే మంటల్లో చిక్కుకుని ఉండాల్సిన వాడినని
బాలీవుడ్ పెద్దమనిషి అమితాబ్ బచ్చన్ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్
ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాను అప్పుడే తన పెర్ఫార్మెన్స్
ముగించుకుని అక్కడి నుంచి కారులో బయల్దేరానని, కాసేపటికే అక్కడ మంటలు
అంటుకున్నాయని అమితాబ్ చెప్పారు. అయితే అక్కడి వాళ్లు తనను కాసేపు అక్కడే
ఉండి.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిసి వెళ్లాల్సిందిగా కోరారని,
కానీ పని ఉండటంతో వెళ్లిపోయానని చెప్పారు. ఒకవేళ అక్కడే ఉండి ఉంటే, తాను
అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయేవాడినని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేవుడి
దయ వల్ల వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని, అలాగే ఇంత పెద్ద ప్రమాదం
జరిగినా ఎవరూ మృతి చెందకపోవడం అదృష్టమని ట్వీట్ చేశారు. అయితే ఇది మాత్రం
చాలా భయానకమైన అనుభవం అన్నారు.
ఇక బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్షనిస్టు ఆమిర్ ఖాన్ కూడా ఈ ప్రమాదం గురించి
తన ఫేస్‌బుక్ పేజీలో రాశాడు. చౌపట్టిలో లైవ్ షో జరుగుతున్నప్పుడు అంత పెద్ద
అగ్నిప్రమాదం సంభవించడం చాలా దురదృష్టకరం గానీ, ముంబై పోలీసులు, అగ్నిమాపక
శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి పరిస్థితిని చాలా చక్కగా హ్యాండిల్
చేశారని అన్నాడు. ఎవరూ కంగారు పడి తొక్కిసలాట జరగకుండా వీఐపీల నుంచి
సామాన్యుల వరకు అందరినీ నిమిషాల మీద గ్రౌండునుంచి పంపారని, చిట్టచివరి
వ్యక్తి అక్కడి నుంచి వెళ్లేవరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అక్కడే
ఉన్నారని చెప్పారు.