రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా విషయంలో రోజుకో వార్త సినీ అభిమానులను ఊరిస్తోంది. ఇప్పటికే తొలిభాగం ఘనవిజయం సాధించటంతో రెండో భాగంపై అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బాహుబలి 2కు మరిన్ని హంగులను సమకూర్చే పనిలో ఉన్నాడు జక్కన్న.
తొలి భాగంలో భల్లాలదేవుడిగా రానాను, అతని కొడుకు పాత్రలో అడవి శేషును చూపించిన రాజమౌళి రానా భార్య పాత్రను మాత్రం చూపించలేదు. అయితే కథకు కీలకమైన పాత్రను రెండో భాగంలో చూపించనున్నాడట. ఇప్పటికే ఈ పాత్రకు తగ్గ నటికోసం వేట కూడా ప్రారంభించాడు రాజమౌళి. తొలుత ఈ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరోయిన్ శ్రియను తీసుకోవాలని భావించినా, ఇప్పుడు మనసు మార్చుకున్నారట.
ప్రస్తుతం ఈ పాత్రకు అందాలు రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట బాహుబలి యూనిట్. ఇటీవల భలే భలే మొగాడివోయ్ సినిమాతో మంచిఫాంలో కనిపిస్తున్న లావణ్యకు ఇది గోల్డెన్ ఛాన్సే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు రాజమౌళి టీం కన్ఫామ్ చేయకపోయినా, సాయి కొరపాటి... లావణ్యను తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మరి రాజమౌళి ఎవరిని కన్ఫామ్ చేస్తాడో చూడాలి.