Thursday, January 12, 2017

గౌతమీపుత్ర శాతకర్ణి ఎర్లీ రివ్యూ!


నందమూరి బాల‌కృష్ణ‌ను సంక్రాంతి హీరో అంటారు. ఆయ‌న సినిమాలు సంక్రాంతికొచ్చాయంటే సంద‌డే సంద‌డి. ఇప్పుడు మ‌రోసారి పండ‌గ సంద‌ర్భంగానే బాల‌య్య చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. ఈసారి వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌త్యేక‌మైన‌ది. బాల‌కృష్ణ సినీ ప్ర‌యాణానికి ఓ కీల‌క‌మైన మైలురాయిలాంటి వందో చిత్రం. అది కూడా చారిత్రక క‌థ‌తో కూడుకున్నది కావటం విశేషం. చారిత్రక పాత్ర‌ల్లో ఇమిడిపోతారు బాలకృష్ణ. ఆ త‌ర‌హా క‌థ‌లని న‌మ్మి సినిమా చేయ‌డంలోనూ త‌న‌కి తానే సాటి అయిన బాల‌య్య త‌న వందో చిత్రంగా `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చేయ‌డం విశేషం. తెలుగు జాతి వీర‌త్వాన్ని చాటి చెప్పిన శ‌క‌పురుషుడు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర‌లో బాల‌య్య‌ను.. ఆయ‌న హావ‌భావాల్ని.. పౌరుషంతో చెప్పిన సంభాష‌ణ‌ల్ని ప్ర‌చార చిత్రాల్లో చూసిన‌ప్ప‌ట్నుంచి ప్రేక్ష‌కుల్లో ఆత్రుత‌.. అంచ‌నాలు అంతకంతకూ పెరిగిపోయాయి. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగానే బాల‌య్య తెర‌పై విజృంభించాడా? చ‌రిత్ర ఆధారంగా కొద్దిగానే తెలిసిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జీవితం ఎలాంటిది? ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ఎలా చిత్రీక‌రించార‌న్న‌ది చూస్తే..

కథేంటంటే: ఒకే రాజ్యం... ఒకే యుద్ధం.. అడ్డు గోడ‌లు లేని అఖండ భరత జాతి... అనే కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి (బాల‌కృష్ణ‌) . చిన్న‌ప్పుడే తాను క‌న్న క‌లని సాకారం చేసుకోవ‌డమే ల‌క్ష్యంగా అడుగులేస్తుంటాడు. దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గంతో పాటు మ‌రెన్నో రాజ్యాల‌ని త‌న రాజ్యంలో క‌లుపుకొంటాడు. సౌరాష్ట్రలో నహపాణుడి (కబీర్‌బేడీ) ఆధీనంలో ఉన్న రాజ్యాన్ని కూడా సొంతం చేసుకొని ఉత్త‌ర, ద‌క్షిణాల్ని ఒక్క‌టి చేయాల‌నుకొంటాడు. అయితే అప్ప‌టికే శాత‌క‌ర్ణి పూర్వీకుల్ని ఓడించిన నహపాణుడు దీటుగా జ‌వాబిస్తాడు. నాతో యుద్ధ‌మే చేయాల‌నుకొంటే నీ బిడ్డ పులోమావిని తీసుకొని రా అంటాడు. నేను ఓడిపోతే నా వీర‌ఖ‌డ్గం నీకు ఇస్తాను, నువ్వు ఓడిపోతే నీ బిడ్డ‌ని నాకిచ్చి వెళ్లిపోవాలంటాడు. అందుకు శాత‌క‌ర్ణి ఒప్పుకొన్న‌ప్ప‌టికీ, ఆయ‌న భార్య వాశిష్టీ దేవి (శ్రియ‌) ఎలా స్పందించింది? త‌న బిడ్డ‌తో క‌లిసి యుద్ధానికి వెళ్లిన శాత‌క‌ర్ణి ఎలాంటి పోరాటం చేశాడు? మొత్తం 33 రాజ్యాల్ని ఏక‌ఛత్రాధిప‌త్యం కింద‌కి తీసుకొచ్చి శ‌క‌పురుషుడిగా ఆవిర్భ‌వించిన శాత‌క‌ర్ణిని దెబ్బ కొట్టేందుకు యుద్ధానికి దిగిన గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? శాత‌క‌ర్ణిని ఓడించేందుకు అత‌డుఎలాంటి వ్యూహాల్ని ర‌చించాడు? అందులో గెలుపు ఎవ‌రిది? తిరుగులేని శాత‌క‌ర్ణికి మాతృమూర్తి గౌత‌మి (హేమ‌మాలిని) అండ‌గా నిలిచిన వైనం ఎలాంటిది? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెండితెర‌పైన చూడాల్సిందే.
 

ఎలా ఉందంటే:. మ‌నదైన చ‌రిత్ర‌కి క్రిష్ బృందం క‌లిసిక‌ట్టుగా పెట్టిన ఓ బొట్టు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. బాల‌కృష్ణ త‌న వందో చిత్రంగా ఈ సినిమాని ఎంపిక చేసుకొన్న‌ప్పుడు భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. బాల‌య్య చారిత్రక చిత్రాల్లో చ‌క్క‌గా ఒదిగిపోగ‌ల‌ర‌నే ఓ సానుకూలాంశం త‌ప్ప‌.. చ‌రిత్ర‌లో మాస్ అంశాలు ఏముంటాయి? అభిమానుల్ని మెప్పించ‌గ‌ల‌దా? అనే మాట‌లు వినిపించాయి. కానీ క్రిష్ మాత్రం మ‌న చ‌రిత్ర‌కి మించిన మాస్ అంశం ఏముంటుందని ఈ చిత్రంతో చాటి చెప్పారు. త‌న‌కు ల‌భ్య‌మైన ఆ కొద్దిపాటి చ‌రిత్ర‌నే సినిమాకి అనుగుణంగా చ‌క్క‌టి క‌థ‌గా తీర్చిదిద్దుకొన్నారు, అంతే చ‌క్క‌గా తెర‌పైకి తీసుకొచ్చారు. క‌ళ్యాణ‌దుర్గం రాజ్యంపై శాత‌క‌ర్ణి దండెత్తడం నుంచి సినిమా క‌థ మొద‌లవుతుంది. క‌ళ్యాణ‌దుర్గంతో పాటు, స‌హ‌పాణుడిని ఓడించి మొత్తం 33 రాజ్యాల్ని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంలోకి తీసుకొస్తాడు శాత‌క‌ర్ణి.