Monday, July 4, 2016

స్నేహం కోసం.. ప్రాణం ఇచ్చాడు


ఉగ్రవాదులు వెళ్లిపొమ్మని చెప్పినా కూడా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్ల కోసం అక్కడే ఉండి ఓ బంగ్లాదేశ్‌ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 20ఏళ్ల ఫరాజ్‌ ఆయాజ్‌ హొస్సైన్‌ అనే బంగ్లాదేశీ విద్యార్థిని ఇప్పుడు సోషల్‌ మీడియాలో హీరో అని పొగుడుతున్నారు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్లను వదిలేసి వెళ్లకుండా ఫరాజ్‌ అక్కడే ఉన్నాడని ఇటీవల ఢాకాలోని రెస్టారెంట్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి మీడియాకు వెళ్లడించారు. ఫరాజ్‌ స్నేహితురాళ్లలో భారతీయ యువతి తరుషి కూడా ఉంది.
ఫరాజ్‌ అమెరికాలోని ఎమ్రోయ్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. వేసవి సెలవులకు అతడు బంగ్లాదేశ్‌ వచ్చాడు. సెలవులకు వచ్చిన తన స్నేహితురాళ్లు ఎమ్రోయ్‌ యూనివర్సిటీలో చదువుతున్న అమెరికాకు చెందిన అబింతా కబిర్‌, కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని తరుషి జైన్‌తో కలిసి దాడి జరిగిన రెస్టారెంట్‌కు వెళ్లారు. ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నవారిలో ఈ ముగ్గురు ఉన్నారు. ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌ వారిని వదిలేసి.. విదేశీయులను మాత్రమే హతమార్చారు. అయితే ఫరాజ్‌ను వెళ్లిపొమ్మని చెప్పినా.. తన స్నేహితురాళ్లను వదిలేస్తే వెళ్తానని.. లేదంటే వెళ్లనని చెప్పడంతో ఉగ్రవాదులు అతడిని కూడా చంపేశారు. గత వారం ఢాకాలో ఉగ్రవాదులు రెస్టారెంట్‌పై దాడి చేసి 20 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. భద్రతాసిబ్బంది దాడుల్లో ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.

ధోనిని రజనీకాంత్ తో ఎందుకు పోల్చారంటే?

 టీమిండియా 'మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనిని అభిమానులు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోలుస్తున్నారు. ధోని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసిన హెయిర్ కట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కూల్ గా ఉండడంలోనే కాదు నిరాడంబరతలోనూ తనను తానే సాటి ధోని నిరూపించుకున్నాడని కితాబిచ్చారు. బుద్ధిగా కూర్చుని 'బెస్ట్ ఫినిషర్' సదాసీదాగా జుత్తు కత్తిరించుకుంటున్న ఫొటోను తన ఫేస్ బుక్ పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.                      ఏమాత్రం హంగు ఆర్భాటం లేకుండా ధోని హెయిర్ కట్ చేయించుకోవడం చూసి అభిమానులు అవాక్కయ్యారు. టీమిండియా కెప్టెన్ అంటే హై-ఫై సెలూన్ లో కటింగ్ చేయించుకుంటాడని భావించిన ఫ్యాన్స్ ధోని పెట్టిన ఫొటో చూసి అతడిపై ప్రశంసలు కురిపించారు. కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టే అతడు నిరాడంబరంగా ఉంటాడని వ్యాఖ్యానించారు. ధోనికి ఈగో లేదని, చాలా సింపుల్ ఉంటాడని మరొకరు కామెంట్ చేశారు.              నిరాడంబరంగా ఉండేవాడే నిజమైన సూపర్ స్టార్, సూపర్ హీరో అని.. 'తలైవర్' రజనీకాంత్ తర్వాత ధోనిలో సింప్లిసిటీ చూశానని మరొక అభిమాని అన్నాడు. ధోని ఆటతో పాటు అతడి హెయిర్ స్టైల్ ఎప్పుడు వార్తాల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు హెయిర్ కట్ కూడా హాట్ టాఫిక్ గా మారింది.

ఓడినా ‘కప్’ ఇచ్చారు!

 ఏడు పదుల వయసులో ఏ ఆర్టిస్ట్ అయినా శరీరాన్ని కష్టపెట్టుకునే పాత్రలు చేయడానికి వెనకాడతారు. కానీ, అమితాబ్ బచ్చన్ వంటి కొంతమంది తారలు రిస్క్‌లు తీసుకోవడానికి రెడీ అయిపోతారు. ప్రస్తుతం నటిస్తున్న ఓ చిత్రంలో ఈ బిగ్ బి బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్లతో తలపడుతున్నారు. వాళ్ల ఉత్సాహం, ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేసిందనీ, వాళ్లతో బాక్సింగ్ రింగ్‌లో తలపడటం సవాల్‌గా అనిపించిందనీ అమితాబ్ అన్నారు. ఈ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నా చిన్ననాటి విశేషాలు గుర్తొచ్చాయని అమితాబ్ చెబుతూ - ‘‘ఇష్టం ఉన్నా లేకపోయినా మా స్కూల్లో బాక్సింగ్ నేర్చుకోవాల్సిందే.

 పోటీల్లో ఒకే ఒక్క పాయింట్‌తో గెలుపోటములు ఆధారపడి ఉన్నప్పుడు భలే మజాగా ఉండేది. ఆ ఒక్క పాయింట్ దక్కించుకుని, ఆనందపడేవాణ్ణి. ఓసారి మాత్రం బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఓడిపోయాను. అయినా కప్ ఇచ్చారు. గెలుపు కోసం ధైర్యసాహసాలను మెండుగా ప్రదర్శించినందుకుగాను ఆ కప్ గెల్చుకున్నా. వాస్తవానికి నా ఎత్తు నాకు మైనస్ అయ్యింది.

 నా బరువేమో లోయర్ కేటగిరీ వాళ్లకు సమానంగా ఉండేది. ఎత్తు మాత్రం హయర్ కేటగిరీకి సమానంగా ఉండేది. దాంతో నన్ను హయర్ కేటగిరీకే ఎంపిక చేసేవాళ్లు. వాళ్లేమో ‘ఆలోచించుకో. విరమించుకుంటేనే నీకు మంచిది. లేకపోతే దెబ్బలు తగలడం ఖాయం’ అని హెచ్చరించేవాళ్లు. కానీ, నేను మాత్రం ఆ హెచ్చరికను ఖాతరు చేసేవాణ్ణి కాదు. మొండిగా తలపడేవాణ్ణి. ఇప్పడు సినిమా కోసం బాక్సింగ్ చేస్తుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి’’ అని చెప్పారు.