Tuesday, October 4, 2016

కొత్త జిల్లాల్లో దసరాకు సెలవు నో

 దసరా పండుగ రోజున ఉద్యోగులు విధిగా విధులకు హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రోజున కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నందు న సెలవును రద్దు చేసింది. జిల్లాల  పునర్విభజనతో సంబంధ మున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు.

 జిల్లాల ప్రారంభం రోజున ఉదయం 10:30 గంటలకల్లా కలెక్టరేట్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా వర్క్ టు సర్వ్ ఆర్డర్లను అందజేయాలని సూచించారు. అన్ని విభాగాల ఉద్యోగులకు వర్తించేలా సింగిల్ ఆర్డర్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక పునర్విభజన పరిధిలోకి రాని ఉద్యోగులు సోమవారం (10వ తేదీ) ఐచ్చిక సెలవును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
 
వేడుకలు నిర్వహించండి
నూతన జిల్లా, డివిజన్, మండలాలకు అవసరమైన ఫైళ్లు, స్టేషనరీ, ఫర్నిచర్ ఇతర సరంజామాను ఆయా కార్యాలయాలకు తక్షణం చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆవిర్భావ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యమైన ఫైళ్లను మాత్రం మాతృ (ప్రస్తుత) జిల్లా కార్యాలయాల్లోనే ఉంచాలని.. పరిపాలన కుదుటపడ్డాక సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేయాలని పేర్కొంది. నూతన మండలాల్లో ఆవిర్భావ వేడుకలను ఇన్‌చార్జి అధికారులు నిర్వహించాలని కోరింది. కొత్త జిల్లాలకు కొత్త వెబ్‌సైట్, ఫేస్‌బుక్ ఖాతాలను అదే రోజున ఆవిష్కరించాలని స్పష్టం చేసింది.
 
తొలి రోజునే పని విభజన
జిల్లాల ఆవిర్భావం రోజునే ఏ అధికారి ఏ విధులు నిర్వహించాలి, ఏయే విభాగం ఏయే దస్త్రాలను పరిశీలించాలన్న అంశంపై పని విభజన జరగాలని సర్కారు ఆదేశించింది. దానివల్ల ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం ఉండదని స్పష్టం చేసింది. ప్రజల నుంచి అందే అర్జీలను పరిష్కరించేందుకు సిటిజన్ చార్టర్ అమలు పక్కాగా జరిగేం దుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇక మండలాలను ఏ, బీ, కేటగిరీ లుగా విభజించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించనుంది. ‘ఏ’ కేటగిరీలోని మండలాలకు ఉద్యోగుల కేటాయింపులో కోత ఉండదు. బీ కేటగిరీ మండలాలకు సిబ్బందిని కుదించనున్నారు. ఆయా మండలాలకు డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఉండదని అధికారవర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment