ఒక క్రేజీ జంటను సెట్ చేయడం అంత సులభం కాదు. నటుడు విక్రమ్, నటి నయనతార కలిసి నటించడానికి చాలా ఏళ్లే పట్టిందన్న సంగతి తెలిసిందే. చిన్న ఈగోనే ఇందుకు కారణం అనే ప్రచారం జోరుగా సాగింది. అలాంటిది ఎట్టకేలకు ఇరుముగన్ చిత్రంలో వీరి జత కుదిరింది.చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరోసారి ఈ హిట్ పెయిర్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. అందుకోసం దర్శకుడు గౌతమ్‌మీనన్ చాలా ప్రయత్నిస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. శింబు హీరోగా అచ్చయం ఎన్భదు మడమైయడా చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్‌మీనన్ తాజాగా ధనుష్‌తో ఇన్నై నోక్కి పాయుం తోటా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం అనే చిత్రాన్ని చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. నిజానికి ఈ చిత్రం ఈ నెల రెండవ తేదీనే సెట్‌పైకి రావలసింది. కానీ అలా జరగలేదు. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో విక్రమ్‌కు జంటగా నటి నయనతారను నటింపజేయాలని దర్శకుడు భావించారట.ఆ విషయమై నయనతారను సంప్రదించగా తను డిమాండ్ చేసిన పారితోషికం దర్శకుడు గౌతమ్‌మీనన్ కు ముచ్చెమటలు పట్టించిందని టాక్. అయినా ధ్రువనక్షత్రంలో నాయకి పాత్రకు నయనతారనే కరెక్ట్ అని భావించిన దర్శకుడు ఆమెను పారితోషికాన్ని తగ్గించుకోమని రిక్వెస్ట్ చేసే పనిలో ఉన్నారట.
అయితే ప్రస్తుతం లేడీఓరియెంటెడ్ చిత్రాలు, యువ హీరోలతో చిత్రాలు అంటూ యమ బిజీగా ఉన్న టాప్ నాయకి నయనతార గౌతమ్‌మీనన్ కోసం దిగి వచ్చి తన పారితోషికాన్ని తగ్గించుకుంటారా? మళ్లీ విక్రమ్‌తో జోడీ కుదురుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. ధ్రువనక్షత్రం చిత్రం అనుకున్నట్లు ప్రారంభం కాకుండా జాప్యం జరగడంతో అసహనానికి గురైన విక్రమ్ దుబాయ్‌కి చెక్కేసారని కోలీవుడ్‌లో టాక్. త్వరలో చిత్రం ప్రారంభం అయ్యిందా సరే. లేకుంటే ఈ నెల 26వ తేదీ నుంచి వాలు చిత్రం ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించనున్న చిత్రానికి రెడీ అవుతారని సమాచారం.