కొద్ది కాలంగా తెలుగు తెరపై క్రైమ్ కామెడీ చిత్రాల సందడి ఎక్కువైంది. ఇలాంటి చిత్రాల్లో ఆసక్తికరమైన కథాంశం, కథను వేగంగా నడిపించే స్ర్కీన్‌ప్లే, సందర్భోచిత హాస్యాన్ని అందించే సంభాషణలు ఉంటే చాలు, తారాగణంతో సంబంధం లేకుండానే ప్రేక్షకులు విజయాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈకోవలోనే తెరకెక్కిన చిత్రం గుంటూర్ టాకీస్. జాతీయ పురస్కారం సాధించిన చందమామ కథలు చిత్రాన్ని తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు దర్శకుడు కావడం, బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మి నాయికగా నటించడం, శ్రద్ధదాస్ కీలక పాత్రలో కనిపించనుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
కథేంటంటే: గుంటూర్ టాకీస్ మెడికల్ షాపులో చిరుద్యోగులుగా పనిచేసే హరి(సిద్ధు), గిరి(నరేష్) రాత్రివేళ చిల్లరదొంగతనాలు చేస్తుంటారు. ఓరోజు రాత్రి దొంగతనానికి వెళ్లినప్పుడు ఓ ఇంట్లో హరికి రూ. ఐదు లక్షలు దొరుకుతుంది. ఆ విషయం గిరికి చెప్పడు. మరో ఇంట్లో గిరికీ రూ.ఐదులక్షలు దొరుకుతాయి. ఆ విషయం హరికి చెప్పకుండా దాస్తాడు. అయితే ఆ రెండిళ్లు సీఐ రఘబాబువన్న విషయం వారికి తెలియదు. హరి ఆ డబ్బుతో తను ప్రేమించే రష్మితో కలసి ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్లిపోతాడు. అక్కడ ఓ రౌడీ బ్యాచ్ హరిని బంధిస్తారు. అప్పటికే గిరినీ వారు బలవంతంగా తీసుకొచ్చుంటారు. వారు తాము దొంగలించిన డబ్బు తాలుకు మనుషులేమో అని హరి, గిరి అనుకుంటారు. అయితే వారు మాత్రం కోటి రూపాయలు విలువ చేసే ఓ డబ్బా గురించి అడుగుతూ ఎక్కడ దాచారంటూ తీవ్రంగా కొడతారు. మరోవైపు సీఐ ఇంట్లో దొంగతనం చేసిన హరి, గిరిలను పోలీసులు వెంబడిస్తుంటారు. ఇలా ఇద్దరి మధ్య చిక్కుకున్న హరి, గిరి పరిస్థితి ఏంటి? అసలు ఆ డబ్బా సంగతేంటి? హరికి, రివాల్వర్ రాణి(శ్రద్ధదాస్)కు సంబంధమేంటి? ఇంతకూ ఆ కోటి రూపాయల డబ్బా ఎవరి సొంతమైంది? తదితర విషయాలు తెరపై చూడాలి.
ఎలా ఉందంటే: ఇలాంటి కథలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం వేగం. అయితే ప్రథమార్ధంలో అది కరవైంది. గంట నిడివికే సాగతీత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. విశ్రాంతి సమయం నుంచే అసలైన కథ మొదలైన అభిప్రాయం కలుగుతుంది. అప్పటి వరకూ సిద్దు, నరేష్ పాత్రలే ఎక్కువగా కనిపించిన ప్రేక్షకులకు, ద్వితీయార్ధంలో మహేష్ మంజ్రేకర్, రఘుబాబు తదితరుల ప్రవేశంతో కొత్తదనం ఉంటుందన్న ఆశ కలుగుతుంది. గిలిగింతలు పెట్టే సంభాషణలు కాకుండా సందర్భోచిత హాస్యాన్ని పండించడం బాగుంది. అయితే శ్రద్ధాస్ చేసిన రివాల్వర్ రాణి పాత్రను కుటుంబ ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టం. మహేష్ మంజ్రేకర్, ఫిష్ వెంకట్,రవిప్రకాష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. మహేష్ మంజ్రేకర్ పాత్రతో పలికించిన సంభాషణలు కొందరికి రుచించకపోవచ్చు. మొత్తంగా ఇది యువ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని చేసిన సినిమా కనుక వారికి నచ్చే అవకాశాలు ఎక్కువ.
ఎవరెలా: సిద్ధు, నరేష్ పాత్రలకు ప్రాధాన్యమెక్కువ. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే పైలా పచ్చీస్ యువకుడిగా సిద్దు ఒదిగిపోయాడు. నరేష్ అనుభవం ముందు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. రష్మి కనిపించే సమయం ఎక్కువైనా పలికే సంభాషణలు చాలా తక్కువ. ఓ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాల్లో గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. శ్రద్దదాస్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. మహేష్ మంజ్రేకర్ వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటాడు. ఇతరులు వారి పాత్రల మేరకు నటించారు. పాత్రల రూపకల్పనపై శ్రద్ధ పెట్టే దర్శకుడిగా పేరున్న ప్రవీణ్ సత్తారు ఇందులో ఆ విషయాన్ని మరిచాడు. పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నా వాటి ప్రభావం అంతగా కనిపించదు. శ్రీ చరణ్‌కు పాటలతో ప్రతిభ నిరూపించుకోవడానికి ఇందులో అవకాశం లేదు. నేపథ్య సంగీతంలో ఫర్వాలేదనిపించాడు. దర్శకుడు బిగువైన కథనంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండనిపిస్తుంది.