Friday, December 16, 2016

నేను చాలా మారిపోయా!

కొత్త ఏడాది వచ్చేస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకునేవాళ్లు తీసుకుంటున్నారు. 2016 ఎలా గడిచింది అని విశ్లేషించుకునే పని మీద కొంతమంది ఉన్నారు. శ్రుతీహాసన్‌ కూడా ఈ ఏడాది తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఓసారి ఆలోచించుకున్నారు. ఆ మార్పుల గురించి శ్రుతి చెబుతూ – ‘‘వ్యక్తిగా నేను చాలా మారాను. స్వీయ అవగాహన చేసుకోవడానికి ఈ ఏడాది ఎక్కువ టైమ్‌ కేటాయించాను. ఇంతకుముందు కొన్ని చేయడానికి సంశయించేదాన్ని.
అది మంచిదైనా ఎందుకో వెనకడుగు వేసేదాన్ని. కానీ, ఇకనుంచి ముందడుగు వేస్తాను. నా ఇష్టాయిష్టాల పరంగా కూడా నేనో నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చేశా. ‘ఇది మనకు నచ్చదు’ అని ఓ విషయం గురించి అనుకుంటే ఇక ఎప్పటికీ నచ్చదు. నచ్చినది ఎప్పటికీ నచ్చుతుంది. అంత బలమైన అభిప్రా యాలను కలగజేసిన సంవత్సరం ఇది. వయసు, అనుభవం వ్యక్తుల్లో పరిణతి తెస్తాయంటారు. 30 ఏళ్లొచ్చేశాయ్‌ కదా.. నాలోనూ పరిణతి వచ్చింది’’ అన్నారు.

కొంచెం టర్నింగ్‌ ఇచ్చుకో రఘువరా!

 సీనియర్‌ హీరోల్లో మామ రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌... యంగ్‌ హీరోల్లో అల్లుడు ధనుష్‌ తిరుగు లేని మాస్‌ హీరో. అల్లుడు సినిమాకి ఇప్పటివరకూ రజనీ క్లాప్‌ కొట్టలేదు. ఫస్ట్‌ టైమ్‌ అది జరిగింది. మామ ఎంతో ఆత్మీయంగా క్లాప్‌ ఇస్తుంటే.. అల్లుడు అలా వెనక్కి తిరిగాడేంటి? మరి అదే వెరైటీ. ‘మా సినిమా కొత్తగా ఉంటుంది’ అని ముహూర్తపు దృశ్యం నుంచే చూపించాలనుకుని ఉంటారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి రజనీ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. రజనీతో ఇటీవల ‘కబాలి’ చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్‌. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ధనుష్, అమలాపాల్‌ నటించిన ‘విఐపీ’ (వేలై ఇల్లా పట్టదారి)కి ఇది సీక్వెల్‌. ‘వైలై ఇల్లా పట్టదారి 2’గా తమిళంలో, ‘వీఐపీ 2’గా తెలుగులో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి భాగం తెలుగులో ‘రఘువరన్‌ బీటెక్‌’గా రిలీజై, ఇక్కడ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ‘వీఐపీ’లో ధనుష్‌ సరసన కథానాయికగా నటించిన అమలాపాల్‌ సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ–మాటలు: ధనుష్, స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సౌందర్యా రజనీకాంత్‌.