Tuesday, October 20, 2015

ఐపీఎల్‌కూ గుడ్‌బై...

ఏంటీ షాక్... మనసు జీర్ణించుకోలేకపోతోంది. సెహ్వాగ్ ఆటను ఇక చూడలేమా..? అంతర్జాతీయ క్రికెట్‌లో సరే. ఐపీఎల్‌లోనూ అతను ఆడటం లేదా..? ఎందుకీ కఠిన నిర్ణయం. ఏం వయసైపోయిందని అప్పుడే రిటైరవుతున్నాడు..! తొలి ఓవర్లోనే అలా బంతులు ఎగిరి స్టాండ్‌లో పడుతుంటే మేం తీన్‌మార్ వేయడం ఇష్టం లేదేమో..! జిడ్డురా బాబూ అంటూ టెస్టులకు రాని స్నేహితులు, వీరూ ఉన్నాడురా అంటే ఉరుకుతూ వచ్చేవాళ్లు. 

                     పొగరుగా ఎగిరే షోయబ్ అక్తర్ బంతిని అలవోకగా సిక్సర్ బాదుతుంటే... ఎవరినైనా భయపెట్టే బ్రెట్‌లీ బౌన్సర్‌ని స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే...  స్టెయిన్ బుల్లెట్ బంతులు కూడా బౌండరీలు దాటుతుంటే... బంతిని ఎలా తిప్పుతాడో తెలియని వార్న్ కూడా తలపట్టుకుంటే... దానర్థం ఒక్కటే. అక్కడ సెహ్వాగ్ ఆడుతున్నాడని.
                      1999లో సెహ్వాగ్ జట్టులోకి వచ్చినా రెండేళ్ల పాటు సాధారణ క్రికెటర్లలో ఒకడు మాత్రమే. 2001లో కొలంబోలో న్యూజిలాండ్‌పై 69 బంతుల్లోనే సెంచరీ బాదినప్పుడు తొలిసారి అనిపించింది... ఆహా... ఏం ఆటగాడు దొరికాడురా అని. అప్పటి నుంచి 12 ఏళ్ల పాటు భారత అభిమాని ఎప్పుడూ వినోదం కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. సచిన్ లాంటి దిగ్గజంతో సరిసమానంగా షాట్లు ఆడాలంటే ఎంత గొప్ప ఆటగాడై ఉండాలి. ప్రత్యర్థులు 300 లక్ష్యాన్ని ఎదురుగా ఉంచినా... వీరూ పది ఓవర్లు ఉంటే చాలురా బాబూ అనుకునేవాళ్లం. ఎదురుగా ఎంత గొప్ప బౌలర్ ఉన్నా అదురూ బెదురూ లేదు. బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా ఉన్న పిచ్‌పై కూడా పునరాలోచన లేదు. బాదడం ఒక్కటే తెలుసు. ఉన్నంతసేపు దడదడలాడిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించడమే తెలుసు.
                        95 పరుగుల మీద ఒక్క బంతి కూడా వృథా చేయకుండా సిక్సర్ కొట్టాలంటే ఎంత ధైర్యం కావాలి. టెస్టు మ్యాచ్‌లో 294 పరుగుల దగ్గర స్పిన్నర్ బౌలింగ్‌లో ముందుకు రావాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే.. వీరూలాంటి విధ్వంసం మరెవరికీ సాధ్యం కాదు. గత దశాబ్ద కాలంలో... ఆ మాటకొస్తే క్రికెట్‌లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ సెహ్వాగ్. తను రిటైరైతే క్రికెట్ ప్రపంచం రిచర్డ్స్‌ను గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ ఒక్క పోలిక చాలు తను అభిమానులు, సహచరుల గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించుకున్నాడో

                           ప్రశంసల వెల్లువ
  అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కు క్రికెట్ ప్రపంచంతో పాటు   పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు కావలసిన వినోదాన్ని సెహ్వాగ్ అందించాడు. ఎంతోమంది యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపాడు. అతని భవిష్యత్తు బాగుండాలి’         -శశాంక్ మనోహర్

సెహ్వాగ్‌కు నా అభినందనలు. దేశానికి ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. భారత క్రికెట్‌కు తను రిచర్డ్స్. దిగ్గజాల్లో ఒకడిగా ఆటకు వీడ్కోలు చెబుతున్నాడు. అంకితభావం ఉంటే ఎలా ఎదగొచ్చో వీరూను చూసి నేటి తరం క్రికెటర్లు నేర్చుకోవాలి’     - అనురాగ్ ఠాకూర్

రిచర్డ్స్ బ్యాటింగ్‌ను నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లను సెహ్వాగ్ బాదడం కళ్లారా చూశాను. వీరూలాంటి మైండ్‌సెట్ ఉన్న ఆటగాడిని చూడలేం. మిగిలిన ఆటగాళ్లు సింగిల్ కోసం ఆడే చోట వీరూ బౌండరీ కోసం ప్రయత్నిస్తాడు’      -ధోని
 

వీరూ భాయ్ నీతో కలిసి ఆడగలగడం నా అదృష్టం. నీది అద్భుతమైన కెరీర్. నీ మార్గదర్శకత్వానికి, నువ్విచ్చిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. ఆధునిక క్రికెట్‌లో నువ్వు దిగ్గజం’     -కోహ్లి
 
శుభాకాంక్షలు వీరూ. నువ్వు అద్భుతమైన వినోదాన్ని అందించావు. ఎన్నో గొప్ప జ్ఞాపకాలను అందించినందుకు కృతజ్ఞతలు       -లక్ష్మణ్


ఆటలోనూ, జీవితంలోనూ సెహ్వాగ్ దృక్పథం అంటే నాకు చాలా ఇష్టం. తను ఆడిన ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ను రెండో ఎండ్‌లో నిలబడి చూశాను. మనందరిలో ఇంకా సంతోషాన్ని, నవ్వులను వీరూ తెస్తాడు. తన ప్రదర్శనలతో ఆటపై తన ముద్రను వేసి వెళుతున్నాడు’     -సచిన్



టాపార్డర్‌లో సెహ్వాగ్‌లా బ్యాటింగ్ చేసే క్రికెటర్ మరొకరు లేరు. జట్టు కోసం ఎప్పుడూ కష్టపడేవాడు. తన రెండో ఇన్నింగ్స్ కూడా సంతోషంగా సాగాలి’     -కుంబ్లే