Tuesday, January 26, 2016

నా వ్యక్తిగత జీవితం మీకెందుకు?

 ‘దేశముదురు’లో సిమ్లా ఆపిల్‌లా ఆకర్షించింది హన్సిక. ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్‌ సంపాదించేసింది. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ నటించింది. గతకొంతకాలంగా తెలుగు సినిమాలేం చేయకపోయినా తమిళనాట మాత్రం బిజీనే. ఆమె నటించిన చిత్రాలు కొన్ని అనువాదరూపంలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తుంటాయి. ఇప్పుడు ‘కళావతి’గా భయపెట్టబోతోంది హన్సిక. ‘చంద్రకళ’ చిత్రానికి ఇది కొనసాగింపు. సిద్ధార్థ్‌, త్రిష, పూనమ్‌ బజ్వా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘చంద్రకళ’కి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘కళావతి’. ఇందులో నేను గర్భిణీగా కనిపిస్తా. ఈ పాత్రని ఓ సవాల్‌గా తీసుకొన్నా. గర్భిణీలు ఎలా నడుస్తారు? ఎలా కూర్చుంటారు? అనే విషయాలని నిశితంగా గమనించిన తరవాతే సెట్లో అడుగుపెట్టా. త్రిష, పూనమ్‌, నేనూ కలసి నటించాం. త్రిషకీ నాకూ మధ్య ఏవో గొడవలు జరిగాయని వార్తలొచ్చాయి. వాటిలో నిజం లేదు. తనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఈ సినిమాతో స్నేహితులమైపోయాం.
* నిజానికి దెయ్యం సినిమాలంటే నాకు చాలా భయం. ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చూడలేదు. ‘చంద్రకళ’, ‘కళావతి’ సినిమాల్నీ మా అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని చూశా. నటించేటప్పుడు మాత్రం ఎలాంటి భయం ఉండదు. కానీ చూడాలంటే మాత్రం ఒణుకొచ్చేస్తుంటుంది.
 
 * నటిగా నాకు తెలుగు, తమిళం రెండు భాషలూ ముఖ్యమే. ఎక్కడ మంచి కథలొస్తే అక్కడ నటిస్తా. తెలుగు సినిమాలకు నేనేం దూరం కాలేదు. మంచి కథ అనిపిస్తే నటించడానికి ఎప్పుడూ సిద్ధమే. ఇప్పుడిప్పుడే తెలుగు భాషకూడా అర్థం అవుతోంది. కానీ... స్పష్టంగా మాట్లాడలేకపోతున్నా. 
* ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తుంటా. ఒత్తిడిలో ఉన్నాననిపిస్తే వెంటనే బ్రష్‌ పట్టుకొని... కూర్చుండిపోతా. ఏడెనిమిది గంటలు అలసట లేకుండా అలా బొమ్మలు వేస్తూనే ఉంటా. ఈమధ్యే రెండు బొమ్మలు వేశా. త్వరలోనే నా పెయింటింగ్స్‌తో ఓ ప్రదర్శన నిర్వహించాలని ఉంది. * నాకు తిండిపై ధ్యాస తక్కువే. చాలామంది తినడం కోసం బతుకుతారు. (నవ్వుతూ) నేను మాత్రం బతకడం కోసం తింటుంటా. ఇది వరకు బాగా బొద్దుగా ఉండేదాన్ని. సన్నబడాలని నాకే అనిపించింది. అందుకే ఇలా స్లిమ్‌ అయ్యా.
నా వ్యక్తిగత విషయాలు మీడియాలో వస్తుంటాయి. వాటిపై నేను స్పందించను. నా పని చూసి మాట్లాడండి. నా జీవితం గురించి మీకెందుకు? 30 మంది అనాధ పిల్లల్ని చేరదీసి వారి ఆలనా పాలనా చూసుకొంటున్నా. అదీ నా వ్యక్తిగతమే. నా మానసిక సంతృప్తి కోసం నేను ఎంచుకొన్న మార్గం అది. ప్రస్తుతం నా చేతిలో నాలుగు తమిళ చిత్రాలున్నాయి. తెలుగులో కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు.

తొలి టీ20లో ఆసీస్‌ను చిత్తు చేసిన ధోనీసేన


  ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ లో టీమిండియా బోణి చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ20లో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 151 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(44) ఫర్వాలేదనిపించగా, స్టీవ్ స్మిత్(21), డేవిడ్ వార్నర్(17), షేన్ వాట్సన్(12), ట్రావిస్ హెడ్(2), వేడ్(5),ఫాల్కనర్ (10)లు నిరాశపరచడంతో ఆసీస్ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ లో ఆకట్టుకున్నటీమిండియా.. ఆపై బౌలింగ్ లో కూడా రాణించి సమష్టి విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా వికెట్లు సాధించగా, అశ్విన్, జడేజా, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు లభించాయి. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఆశిష్ నెహ్రా నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
 
  అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లి దూకుడుగా ఆడటంతో 189 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. కోహ్లి(90 నాటౌట్; 55 బంతుల్లో9 ఫోర్లు, 2 సిక్స్లర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, అతని జతగా సురేష్ రైనా(41;34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (31; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ కాగా, శిఖర్ ధావన్(5) అనవసర షాట్ కు యత్నించి అవుటయ్యాడు. ఈ జోడి తొలి వికెట్ కు 40 పరుగులు చేసింది. కాగా, వీరిద్దరూ ఒక పరుగు వ్యవధిలో అవుట్ కావటంతో టీమిండియా జట్టులో ఒక్కసారిగా ఆందోళన రేగింది.

అయితే విరాట్, రైనాల జోడి సమయోచితంగా ఆడి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.  ఈ క్రమంలోనే విరాట్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, మరోవైపు రైనా కూడా చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి మూడో వికెట్ కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చింది. అయితే చివరి ఓవర్ రెండు బంతికి రైనా అవుటయ్యాడు. ఆ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(11 నాటౌట్; 3బంతుల్లో 1 సిక్స్, 1ఫోర్) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.