ఇంగ్లండ్ ఆటగాళ్లు సింహనాదం చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న రాజ్ కోట్ స్టేడియం దద్దరిల్లేలా భారత్ పని పట్టారు. తొలి రోజు పూర్తి ఆధిపత్యం కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు.. రెండో రోజు కూడా అదే ఊపును ప్రదర్శించి శతకాలతో శభాష్ అనిపించింది.
జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ లు శతకాలు సాధించి భారత్ బౌలింగ్ ను తీవ్రంగా గాయపరిచారు. బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో జో రూట్(124) సెంచరీ చేయగా, ఈ రోజు ఆట ఆరంభంలో మొయిన్ అలీ(117) శతకం పూర్తి చేశాడు. ఆ తరువాత మిడిల్ ఆర్డర్ ఆటగాడు బెన్ స్టోక్స్ మరో శతకం సాధించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది.
311/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ జట్టులో మొయిన్ అలీ(117) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం బెన్ స్టోక్స్-బెయిర్ స్టోల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. ఈ జోడి ఆరో వికెట్ కు 99 పరుగులు జోడించిన తరువాత బెయిర్ స్టో(46)అవుటయ్యాడు. దాంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్ ఆటగాడు వోక్స్(4)కూడా తొందరగా అవుట్ కావడంతో భారత్ శిబిరంలో కాస్త ఆనందం చోటు చేసుకుంది.
అయితే భారత్ ఆనందానికి బెన్ స్టోక్స్ (128)చెక్ పెట్టాడు. ఒక క్లాసికల్
ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. దాంతో ఇంగ్లండ్ సునాయాసంగా 500 పరుగుల
మార్కును చేరుకుంది. టెయిలెండర్ అన్సారీ(37) ఫర్వాలేదనించడంతో ఇంగ్లండ్
తొలి ఇన్నింగ్స్ లో 537 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా, భారత్ లో సిరీస్ లో
ఒక ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ లో మూడు శతకాలు నమోదు చేయడం 2009 తరువాత
ఇదే తొలిసారి. 2009లో మోతేరాలో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో
శ్రీలంక మూడు శతకాలు సాధించింది.