Friday, October 14, 2016

ఆమె ‘బాహుబలి’లో నటించనందట!

 ‘బాహుబలి’ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా భారత చిత్ర పరిశ్రమ ఖ్యాతిని చాటింది. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం కోసం దాదాపు అందరు నటీనటులు ఎదురుచూస్తుంటారు. అయితే ఈ చిత్రంలోని రమ్యకృష్ణ పాత్రలో నటించేందుకు శ్రీదేవి నిరాకరించిన సంగతి తెలిసిందే. కేవలం ఆమే కాదు మరో నటి కూడా ‘బాహుబలి’లో నటించేందుకు ఒప్పుకోలేదట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్‌ కథానాయిక సోనమ్‌ కపూర్‌. ఇటీవల చాట్‌ షో కార్యక్రమంలో ‘బాహుబలి’ చిత్రంపై తన అభిప్రాయం గురించి అడిగిన ప్రశ్నకు సోనమ్‌ కపూర్‌ షాకింగ్‌ సమాధానం ఇచ్చారు.
‘ఆ సినిమా(బాహుబలి) చూడలేదు. నేను ఆ చిత్రం కథ విన్నాను, అందులో నటించే అవకాశం వచ్చింది. కథ అద్భుతంగా ఉంటుంది’ అని సోనమ్‌ అన్నారు. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టగానే ఇంత చక్కటి అవకాశాన్ని సోనమ్‌ ఎందుకు వదులుకుంది? అని ఆశ్చర్యపోయారట. మరి ఏ కారణంగా ఈ అవకాశం వద్దనుకుందో, ఏ పాత్రలో తనను నటించమన్నారో సోనమ్‌ చెప్పలేదు.

దీపావళికి చూపిస్తారా?

 మహేష్‌బాబు, మురుగదాస్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ దీపావళికి టీజర్‌ని విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబరు నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. చెన్నైలోనూ కొంత మేర షూటింగ్‌ జరిగింది. ప్రస్తుతం చిత్రబృందం టైటిల్‌ వేటలో ఉంది. ‘వాస్కోడిగామా’, ‘ఎనిమీ’, ‘అభిమన్యుడు’ ఇలా చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవేం కాదని చిత్రబృందం స్పష్టం చేసింది. తెలుగు, తమిళ భాషలు రెండింటికీ సరిపోయేలా టైటిల్‌ ఉండాలని మహేష్‌ భావిస్తున్నారట. దీపావళిలోగా టైటిల్‌ విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.