Tuesday, January 22, 2019

‘మా ఇద్దరినీ అంతం చేయాలని చూస్తున్నారు’

 గ్లామరస్‌ మాఫియా కారణంగానే తమ సినిమాకు థియేటర్లు దొరకలేదని, అందుకే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని బాలీవుడ్‌ మూవీ ‘రంగీలా రాజా’ నిర్మాత, సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ) మాజీ చైర్మన్‌ పహ్లజ్‌ నిహలానీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ సెన్సార్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్న సమయంలో కఠినంగా వ్యవహరించినందు వల్లే కొంతమంది నన్ను టార్గెట్‌ చేశారు. నా కారణంగా హీరో గోవిందాను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను, గోవిందాను అంతం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఇండస్ట్రీ మొత్తం కొంతమంది చేతుల్లో చిక్కుకుపోయింది. కార్పోరైటేజషన్‌ పేరుతో నా వంటి నిర్మాతలను అణగదొక్కాలని చూస్తున్నారు. అయినా భయపడేది లేదు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధిస్తా’ అని వ్యాఖ్యానించారు.
ఇక ఈ విషయం గురించి మాట్లాడిన గోవిందా.. ‘ గత తొమ్మిదేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది. నా సినిమాలకు థియేటర్లు దొరకకుండా కొంతమంది అడ్డుతగులుతున్నారు. నేనేమీ రాజకీయాల్లో లేనుకదా. దయచేసి నా పనిని సక్రమంగా చేసుకోనివ్వండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గోవిందా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రంగీలా రాజా’ సినిమా శుక్రవారం విడుదలైంది.