పేరు ఉంగరాలు రాంబాబు. ఓహో.. ఉంగరాల వ్యాపారం చేస్తాడేమో అనుకుంటున్నారా?
అబ్బే అలాంటిదేం లేదు. మనోడికి జాతకాలంటే మహా నమ్మకం. అందుకే ఆ రాయి.. ఈ
రాయి.. అంటూ రాళ్ల ఉంగరాలతో వేళ్లను నింపేసుకున్నాడు. కామెడీ హీరో సునీల్
టైటిల్ రోల్ చేస్తున్న ‘ఉంగరాల రాంబాబు’. పేరుకే కామెడీ హీరో కానీ..
రెగ్యులర్ కమర్షియల్ హీరోలు చేసే రేంజ్‌లో సునీల్ డాన్సులు చేస్తారు.
అందుకే ఈ సినిమాలో ఆయన ఇంట్రడక్షన్ సాంగ్‌ని భారీగానే ప్లాన్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ సెట్‌లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది.
‘లైఫ్ అంటే ఆట..’ అంటూ సాగే ఈ పాటకు డాన్స్ మాస్టర్ భాను కొరియోగ్రఫీ
చేస్తున్నారు. ఆయన చెప్పిన కొత్త స్టెప్పులను సునీల్ ట్రై చేస్తున్నారు.
‘‘ఇది పెప్పీ నంబర్. సినిమాలో మొదటి సాంగ్. చాలా సై్టల్‌గా ఉండటం కోసం
సెపరేట్ లైటింగ్ స్కీమ్‌తో సెట్ వేసాం’’ అని ఆర్ట్ డైరక్టర్ ఏయస్
ప్రకాష్ చెప్పారు. అన్నట్లు రాంబాబుకి లవర్ లేదా? లేకేం. ఉందండి. ఇందులో
మియా జార్జ్ కథానాయికగా నటిస్తున్నారు. రాంబాబు ఈవిడగారికి ఉంగరం
తొడగటానికి చాలా ఫీట్లే చేస్తాడేమో. ఈ సమ్మర్‌లోనే రాంబాబు సందడి చేయడానికి
రాబోతున్నాడు.