Sunday, May 29, 2016

కొత్త చాంపియన్‌ ఎవరో


నువ్వా.. నేనా..
ఇద్దరూ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఒంటి చేత్తో తమ జట్లను గెలిపిస్తున్నారు. ఆయా జట్ల తరఫున వారే టాప్‌ స్కోరర్లు. కెప్టెన్లుగా జట్లను అద్భుతంగా నడిపిస్తున్నారు. అందుకే ఫైనల్‌ పోరులో విరాట్‌ కోహ్లి, డేవిడ్‌ వార్నర్‌ మధ్య పోరాటం అత్యంత ఆసక్తి రేపిస్తోంది. అసాధ్యమనుకున్న దశ నుంచి బెంగళూరును కోహ్లి తన అద్భుత బ్యాటింగ్‌, నాయకత్వంలో ప్లేఆఫ్స్‌కు చేరిస్తే.. వార్నర్‌ ఆరంభం నుంచి తన జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. కోహ్లి విధ్వంస విన్యాసాల వల్ల మరుగుపడిపోయాడు కానీ..వార్నర్‌ కూడా ఎంతో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరి తుది పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.


బెంగళూరుకు బ్యాటింగే బలం
రెండు జట్లూ తొలి టైటిల్‌ కోసం ఆరాటపడుతున్నవే. రెండూ స్ఫూర్తిదాయక విజయాలతో ముందంజ వేసినవే. ఎవరి బలం వారిది. కోహ్లి రూపంలో బెంగళూరుకు, వార్నర్‌ రూపంలో సన్‌రైజర్స్‌కు స్ఫూర్తిదాయక నాయకులున్నారు. ఐతే ఫైనల్లో ఆర్‌సీబీదే పైచేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ జట్టుకు రెండు సార్లు 2009, 2011లో ఫైనల్‌ ఆడిన అనుభవం ఉంది. ఇప్పటివరకు సన్‌రైజర్స్‌ అత్యుత్తమ ప్రదర్శన ప్లేఆఫ్‌ (2013) మాత్రమే. పైగా బెంగళూరు భీకర ఫామ్‌తో ఫైనల్‌ చేరింది. ఆరంభంలో తడబడ్డ బెంగళూరు ఫ్లేఆఫ్‌ ముంగిట అత్యుత్తమ ఫామ్‌ను అందుకుంది. ప్లేఆఫ్స్‌ చేరాలంటే నెగ్గాల్సిన చివరి నాలుగు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని ప్రదర్శనతో ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ జట్టు ఇప్పుడు జోరుమీదుంది. ముఖ్యంగా బ్యాటింగే బెంగళూరు ప్రధాన బలం. కెప్టెన్‌ కోహ్లి, డివిలియర్స్‌లు భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో కోహ్లి ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. గేల్‌ కూడా టచ్‌లోనే ఉన్నాడు. కేఎల్‌ రాహుల్‌ నిలకడగా రాణిస్తున్నాడు. తీవ్రంగా తడబడ్డ బౌలర్లు గత కొన్ని మ్యాచ్‌ల్లో కుదురుకోవడం, ఫామ్‌ను అందుకోవడం బెంగళూరుకు సంతోషాన్నిచ్చే అంశం. లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ 12 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్‌ వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌ వాట్సన్‌ కూడా 15 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసుకున్నాడు. బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా రాణించాలని బెంగళూరు ఆశిస్తోంది.

సన్‌రైజర్స్‌కు బౌలింగే ఆశ
సన్‌రైజర్స్‌ కూడా చక్కని విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరు.. విరాట్‌ కోహ్లిపై ఆధారపడ్డట్లే సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో తన కెప్టెన్‌ వార్నర్‌పై బాగా ఆధారపడి ఉంది. 16 మ్యాచ్‌ల్లో 779 పరుగులు చేసిన వార్నర్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. క్వాలిఫయర్‌-2లో ఛేదనలో జట్టును దాదాపుగా ఒంటి చేత్తో గెలిపించాడు. మరో ఓపెనర్‌ ధావన్‌ కూడా అతడికి చక్కని సహకారాన్నిస్తున్నాడు. ఐతే కొన్ని విలువైన ఇన్నింగ్స్‌లు ఆడిన యువరాజ్‌ ఫైనల్లో తన అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాలని, హెన్రిక్స్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ సత్తా చాటాలని సన్‌రైజర్స్‌ ఆశిస్తోంది. బెంగళూరుతో తలపడ్డ గత మ్యాచ్‌లో గెలవడం సన్‌రైజర్స్‌కు సానుకూలాంశమే. ఐతే సన్‌రైజర్స్‌ అసలు బలం మాత్రం బౌలింగ్‌లోనే ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ బౌలింగ్‌కు, బెంగళూరు బ్యాటింగ్‌కు మధ్య పోరుగా అభివర్ణించవచ్చు. సీమర్లు భువనేశ్వర్‌ (16 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (15 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు) అద్భుతమైన బౌలింగ్‌తో ఈ సీజన్‌లో హైదరాబాద్‌ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఎంత గొప్ప బ్యాట్స్‌మన్‌కైనా వారి బౌలింగ్‌లో పరుగులు చేయడం కష్టమవుతోంది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో వారి బౌలింగ్‌ అద్భుతం. నెహ్రా గాయంతో దూరమైనా భువి, ముస్తాఫిజుర్‌ తమ జట్టు పదును తగ్గకుండా చూశారు. బరిందర్‌ శరణ్‌ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఐతే ముస్తాఫిజుర్‌ ఫిట్‌నెస్‌ సన్‌రైజర్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. అతడు ఫిట్‌గా లేకపోతే బౌల్ట్‌ మ్యాచ్‌ ఆడతాడు. 
తుది జట్లు(అంచనా)

ఆర్సీబీ: విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్, స్టువర్ట్ బిన్నీ, సచిన్ బేబీ, జోర్డాన్, ఇక్బాల్ అబ్దుల్లా, ఎస్ అరవింద్, చాహాల్

హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్),శిఖర్ ధవన్, హెన్రీక్యూస్,యువరాజ్ సింగ్,దీపక్ హూడా,కట్టింగ్,నమాన్ ఓజా,బిపుల్ శర్మ, భువనేశ్వర్ కుమార్,బరిందర్ శ్రవణ్, ట్రెంట్ బౌల్ట్