కథేంటి?: హార్స్ రేసింగ్‌నే వ్యాపారంగా చేసుకొన్న కుటుంబానికి చెందిన వ్యక్తి మహేంద్రరెడ్డి (జగపతిబాబు). ఆయన కొడుకే సిద్ధార్థ్(సాయిధరమ్ తేజ్). భార్య చనిపోవడంతో సిద్ధార్థే లోకంగా బతుకుతుంటాడు. కానీ ఉన్నట్టుండి సిద్ధార్థ్‌కి తన తండ్రిపై ద్వేషం పెరుగుతుంది. అందుకే చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. పెద్దయ్యాక న్యూ లుక్ పత్రికకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేస్తుంటాడు. ఒక పార్టీలో తొలి చూపులోనే సితార (రకుల్‌ప్రీత్‌సింగ్)ని చూసి ప్రేమిస్తాడు. ఒక లక్ష్యం కోసం పాటుపడుతున్న ఆమెని ప్రేమలో దించే క్రమంలో ఓ చిన్న పొరపాటు జరుగుతుంది. దాంతో సితార తండ్రి రాజీవ్‌రెడ్డి (సురేష్).. నెంబర్ వన్ రేసర్ అయిన సిద్ధార్థ్‌రెడ్డి(ఠాకూర్ అనూప్‌సింగ్)తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. అది తెలుసుకొని సిద్ధార్థ్ ఎలాగైనా పెళ్లి ఆపాలని వెళతాడు. ఇంతలో సితారే తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను సిద్ధార్థ్‌ని ప్రేమించానని, అతను కూడా హైదరాబాద్‌లో రేసరే అని చెబుతుంది. కావాలంటే సిద్ధార్థ్‌రెడ్డికీ, సిద్ధార్థ్‌కీ మధ్య పోటీ పెట్టమని కూడా చెబుతుంది. అదే సమయంలోనే ఈ పోటీలో తన కొడుకు సిద్ధార్థ్‌రెడ్డి గెలుస్తాడని మహేందర్‌రెడ్డి అక్కడికొచ్చి చెబుతాడు. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు సిద్ధార్థ్. తన స్థానంలో వచ్చిన సిద్ధార్థ్‌రెడ్డి ఎవరో తెలుసుకోవాలనుకొంటాడు. మరింతకీ ఆ సిద్ధార్థ్‌రెడ్డి ఎవరు? రేసింగ్‌లో ఎవరు గెలిచారు? సిద్ధార్థ్‌రెడ్డి అసలు రూపం బయటపెట్టి తన తండ్రికి సిద్ధార్థ్ ఎలా దగ్గరయ్యాడు? సితార లక్ష్యం కోసం, ఆమె మనసు సొంతం చేసుకోవడం కోసం సిద్ధార్థ్ ఏం చేశాడు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: తెలుగు సినిమాకి అలవాటైన ఫార్ములా కథే ఇది. ఆ మాట కొస్తే ఫార్ములా కథలు తప్పేం కాదు. కాకపోతే ప్రేక్షకుడు థియేటర్లో కూర్చున్నంతసేపూ ఇది మనం చూసేసిన కథే అనిపించకుండా, ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం సరదాగా గడిచిపోయిందంటే చాలు.. పాసైపోయినట్టే.. ఆ విషయంలో కొంత వరకు సఫలమయ్యాడు దర్శకుడు. తండ్రీ-కొడుకుల బంధానికి హార్స్‌రేస్ నేపథ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథా నేపథ్యంలో కొత్తదనం ఉంది తప్ప కథ, కథనాలు మాత్రం సాధారణంగానే అనిపిస్తాయి. కథ ఎత్తుగడ, హీరోయిన్‌ని చూసి హీరో ప్రేమలో పడటం, ఆ తర్వాత వచ్చే ప్రేమ సన్నివేశాలు రొటీన్‌గా సాగుతాయి. ‘సింగమ్ సుజాత’గా పృథ్వీ కథలోకి ప్రవేశించాక సన్నివేశాలు పరుగులు పెట్టాయి. మహేందర్‌రెడ్డి కొడుకుగా, ఠాకూర్ అనూప్‌సింగ్ ప్రవేశంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. అయితే ఆ తర్వాత కథ మరింత రక్తి కట్టాల్సి ఉండగా, అలా జరగదు. విరామానికి ముందున్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ద్వితీయార్ధంలో పీటర్‌హెయిన్స్‌గా అలీ చేసే సందడి, పతాక సన్నివేశాల్లో హార్స్‌రేసింగ్ సన్నివేశాలు అలరిస్తాయి. కథంతా ప్రేక్షకుడి వూహకు తగినట్లుగానే సాగుతుంది. ఈ సినిమాలో కొత్తగా ఏదైనా ఉందంటే అది హార్స్‌రేసింగ్ నేపథ్యంలో కూడిన సన్నివేశాలే. తొలి సగభాగం స్థాయిలో విరామం తర్వాత కూడా వినోదం మరింత పండుంటే ఈ సినిమా మరోస్థాయికి వెళ్లేది.
ఎవరెలా చేశారంటే: సాయిధరమ్‌తేజ్ హుషారుగా నటించాడు. భావోద్వేగంతో కూడిన సన్నివేశాల్లోనూ పర్వాలేదనిపించాడు. డ్యాన్స్, ఫైట్ల విషయంలో ఎప్పటిలాగే తన మార్కును చూపించాడు. రకుల్ ప్రీత్‌సింగ్ అందంగా కనిపించింది. పృథ్వీ, అలీ, వెన్నెల కిషోర్ వినోదాన్ని పంచే బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. సినిమాలో వాళ్ల పాత్రలే హైలైట్ అయ్యాయి. జగపతిబాబు నటన, ఆయన పాత్ర చాలా బాగుంది. ప్రతినాయకుడిగా ఠాకూర్ అనూప్ సింగ్ తన పరిధి మేర బాగానే నటించాడు. సాంకేతికంగా ఈ సినిమాకు మంచి మార్కులు పడతాయి. ఛాయాగ్రహణం, సంగీతం బాగున్నాయి. అబ్బూరి రవి సంభాషణల్లో మెరుపులు కనిపించాయి. దర్శకుడు తాను అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించాడు. అయితే ద్వితీయార్ధంపై దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. విదేశాల్లో పాటలు, హార్స్ రేసింగ్ సన్నివేశాలు చక్కటి నిర్మాణ విలువలకు అద్దం పట్టాయి.
చివరిగా: తండ్రీకొడుకుల బంధంతో ‘విన్నర్’