Sunday, October 23, 2016

డార్లింగ్‌ ప్రభాస్‌ పూర్తి పేరు ఏంటో తెలుసా?

  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్‌. ’బాహుబలి’ సినిమాతో జాతీయ స్టార్‌గా ఎదిగిన ఆయన ఆదివారం 37వ వసంతంలో అడుగుపెట్టారు. ఆయన జన్మదిన కానుకగా ఇప్పటికే ’బాహుబలి-2’ పోస్టర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌ విడుదల సందర్భంగా 18వ ముంబై చిత్రోత్సవం సందర్భంగా ప్రభాస్‌కు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చి గౌరవించారు.
14 ఏళ్ల నట ప్రస్థానంలో అసాధారణమైన అద్భుతాలను ఈ యంగ్‌ హీరో సొంతం చేసుకున్నాడు. ప్రభాస్‌ ఖాతాలో పలు విజయవంతమైన సినిమాలు ఉన్నప్పటికీ ‘బాహుబలి’ ప్రాంచైజ్‌తో ఒక్కసారిగా గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు. వంద కోట్లు వసూళ్లు సాధించడమే కష్టం అనుకునే టాలీవుడ్‌ రేంజ్‌ ను దాటి ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’  సినిమా ఏకంగా రూ. 600 కోట్లు వసూలు చేసింది. ’బాహుబలి-2’ మీద అనేక అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన కబుర్లు ఇవి..
  • ప్రభాస్‌ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న.
     
  • ’బాహుబలి’  సూపర్‌ సక్సెస్‌తో ఇక ప్రభాస్‌ బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తాడని వినిపిస్తోంది. కానీ, 2014లోనే ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అజయ్‌ దేవగణ్‌ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన ‘యాక‌్షన్‌ జాక్సన్‌’ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు.
     
  • ప్రభాస్‌కు ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినితో నిశ్చితార్థం అయింది. తల్లిదండ్రులు సెలెక్ట్‌ చేసిన అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి గురించి పెద్దగా వివరాలు తెలియదు. గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రభాస్‌ పెళ్లి జరగాల్సి ఉండగా.. ’బాహుబలి’ ప్రాజెక్టు కారణంగా వాయిదా వేసుకున్నాడు. అది ప్రభాస్‌కు పనిపట్ల అంకితభావమని సన్నిహితులు చెప్తారు.
     
  • ప్రభాస్‌ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, త్రి ఇడియట్స్‌ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్‌ విషయానికొస్తే రాబర్ట్‌ డీనీరో నటన అంటే ఇష్టం.
     
  • ప్రభాస్‌కు వాలీబాల్‌ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్‌ వరల్డ్‌ 2010 లక్ష్మణ్‌ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్‌ ఎక్విప్‌మెంట్స్‌ ఇచ్చారు.
     
  • చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్‌ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. 'బాహుబలి' సముద్రం లాంటి సినిమా. ఒక్క బాహుబలి వంద సినిమాలతో సమానం. కాబట్టి మధ్యలో నదిలాంటి సినిమాలను ఇవ్వడం ఆయనకు ఇష్టంలేదు.