టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అవసరం జట్టుకు ఉందా?అంటే అవుననే
సమాధానమే వస్తుంది. టీమిండియా 2011 వరల్డ్ కప్ ను చేజిక్కించుకోవడంలో
యువరాజ్ పాత్ర మరువలేనిది. ఆ టోర్నమెంట్ లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర
పోషించిన యువరాజ్ ను 2015 వరల్డ్ కప్ కు వచ్చేసరికి పక్కన పెట్టారు.
యువరాజ్ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నా కూడా జట్టులో స్థానం కల్పించలేదు. ఆ
డాషింగ్ హీరో లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనబడింది.
2011 వరల్డ్ కప్ లో యువరాజ్ బ్యాటింగ్ లో అదరగొట్టి కప్ ను తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించాడు. యువరాజ్ 113 పైగా సగటుతో 362 పరుగులు చేయడమే కాకుండా.. బౌలింగ్ లో 15 వికెట్లను కూడా తీశాడు. టోర్నీ ఆద్యంతం తనదైన ముద్ర వేసిన యువీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఆ టోర్నమెంట్ లో ఆసీస్ తో్ జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువరాజ్ 57 పరుగులతో నాటౌట్ గా ఉండటమే కాకుండా.. రెండు కీలక వికెట్లను తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అదే యువరాజ్ ఉండి ఉంటే అనే ప్రశ్న ఇప్పడు సగటు భారత క్రీడాభిమానికి కచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ టోర్నమెంట్ లో జడేజా అవసరం ఉందా?అంటే అది ముమ్మాటికీ కానేకాదు అనే సమాధానమే వస్తుంది. ఈ సిరీస్ లో ఏ మ్యాచ్ ల్లో అంచనాలమేర రాణించని జడేజా నాలుగు మ్యాచ్ ల్లో 43 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు తీశాడు. ఇది పూర్తి స్థాయి ఆల్ రౌండర్ ప్రదర్శన అనడం సబబేనా? అంటే దీనికి క్రికెట్ విశ్లేషకులే స్పందించాలి.