టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబం గురించి అతని సోదరుడు జొరావర్ భార్య ఆకాంక్ష శర్మ రోజుకో బాంబు పేలుస్తోంది. యువీ కుటుంబంపై వరుసగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. యువీ తల్లి షబ్నం సింగ్ కు తానంటే భయమని, వాళ్ల కుటుంబం గురించి తాను ఏమి చెబుతానోనని హడలిపోతోందని ఆకాంక్ష చెప్పింది. అయితే తాను జొరావర్ నుంచి విడాకులు మాత్రమే కోరుకుంటున్నానని వెల్లడించింది.
జొరావర్, ఆకాంక్ష రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా మనస్ఫర్థల కారణంగా పెళ్లయిన నాలుగు నెలలకే విడిపోయారు. రియల్టీ టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న ఆకాంక్ష సంచలన విషయాలు వెల్లడించింది. జొరావర్ కు, తనకు విభేదాల్లేవని, షబ్నం కారణంగానే తాము విడిపోయామని ఇటీవల ఆకాంక్ష ఆరోపించింది. ఇదే షోలో ఆమె మాట్లాడుతూ యువరాజ్ సింగ్ గంజాయి తాగేవాడంటూ మరో బాంబు పేల్చింది. 'నేను చేస్తున్న ఆరోపణలు నిజంకాబట్టే షబ్నం భయపడుతోంది. నేను అబద్ధాలు చెప్పినట్టయితే ఆమె అంత తీవ్రంగా స్పందించేది కాదు. షబ్నం కుటుంబం నుంచి నేనేమీ కోరుకోవడం లేదు. కేవలం విడాకులు ఇవ్వాలని చెబుతున్నా. నా జీవితం నేను గడపాలని భావిస్తున్నా' అని ఆకాంక్ష చెప్పింది.
కాగా ఆకాంక్ష ఆరోపణల్ని యువీ కుటుంబం ఖండించింది. ఆకాంక్ష తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తమ కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని షబ్నం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆకాక్ష ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది.