తెలుగు సినీ రంగం నుంచి చాలా అరుదుగా వస్తుంటాయి కానీ క్రైమ్ కామెడీలకి ఇక్కడ ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మనీ, అనగనగా ఒక రోజు, ఐతే, స్వామిరారా లాంటి సినిమాలు ఈ జోనర్‌లో ఒక స్టాండర్డ్ సెట్ చేసాయి. చూడ్డానికి మామూలుగా అనిపించినా కానీ ఇలాంటి సినిమాల్ని డీల్ చేయడం అంత తేలిక కాదు. దర్శకుడికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో పాటు థింకింగ్ బ్రెయిన్ కూడా కంపల్సరీ. కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకి ఆ రెండూ ఉన్నాయని ఈ చిత్రంలో చాలా సందర్భాల్లో తెలుస్తుంది. రెగ్యులర్ హ్యూమర్ కాకుండా వివిధ రకాల హాస్యాన్ని పండించాడు. కొన్ని చోట్ల తెలివిగా, కొన్ని చోట్ల తింగరిగా, కొన్ని సందర్భాల్లో వెకిలిగా, కొన్ని సందర్భాల్లో పేరడీతో, మరికొన్ని చోట్ల అశ్లీలంతో (సాయికుమార్, ఐశ్వర్య ట్రాక్) నవ్విస్తుందీ చిత్రం.
శ్రీరామ్ ఆదిత్య ఖచ్చితంగా తన కథపై చాలా కసరత్తు చేసాడు. దీనిని ఆసక్తికరంగా మార్చేందుకు అతను చాలా సమయాన్ని వెచ్చించాడనే సంగతి తెలుస్తూనే ఉంటుంది. కథలోకి ఎంటర్ అయ్యే ఏ క్యారెక్టర్ టైమ్‌పాస్‌కి వచ్చినట్టుండదు. అన్నిటికీ ఒక పర్పస్ ఉంటుంది.. అన్నీ ప్లాట్‌లో ఇన్‌వాల్వ్ అయి ఉంటాయి. ప్రతి పాత్రనీ ఏదో విధంగా ఎంటర్‌టైనింగ్‌గా మలిచేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. కేవలం కథనం, పాత్రల చిత్రణ విషయం మీదే కాదు.. దర్శకుడిగా తన టేకింగ్ గురించి మాట్లాడుకునేట్టు చేయడానికి తగ్గ విధంగా విజువలైజ్ చేసుకున్నాడు. ఎల్లో థీమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ఛేజ్ సీన్ దర్శకుడి ఊహాశక్తిని తెలియజేస్తుంది. స్లమ్స్‌ని, విలన్ డెన్‌ని, హీరో గ్యారేజ్‌ని.. ప్రతి సెట్ పీస్‌కి డీటెయిలింగ్ చక్కగా కుదిరింది. ప్రొడక్షన్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఉత్తమ శ్రేణిలో నిలుస్తాయి.
చక్కని కామెడీతో ఎలాంటి జర్క్స్ లేకుండా సాగిపోయే ఫస్ట్ హాఫ్ సూపర్బ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో ఇంకా క్యారెక్టర్లు ఎంటర్ అవడం, మరికొన్ని త్రెడ్స్ వచ్చి మెయిన్ ప్లాట్‌తో కలవడం వల్ల కాసింత గందరగోళం నెలకొంటుంది. అయితే అన్నిటికీ తగ్గ ముగింపుని ఇవ్వడానికి, డాట్స్ అన్నీ కనెక్ట్ చేయడానికి దర్శకుడు ముందే ప్లాంటింగ్స్ వేసి పెట్టుకున్నాడు. వాటికి పే ఆఫ్స్ ఇస్తూ క్లయిమాక్స్‌ని వినోదాత్మకంగా మలిచాడు. అయితే ఎంటర్‌టైన్ చేసే ప్రాసెస్‌లో కొన్ని సార్లు అతను బ్యాలెన్స్ తప్పాడు. విలన్ పాత్రకి కూడా కామెడీ కోణం ఇవ్వడానికి అన్నట్టు అతని భార్యని (ఐశ్వర్య) సెక్స్ మేనియాక్‌గా చూపించడం కాస్త టూమచ్ అనిపిస్తుంది. అలాగే వేణు, అతని క్రైమ్ పార్టనర్ జోడీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనిపిస్తుంది. పైగా వారిపై ఒక పాట కూడా చిత్రీకరించారు. అవసరమే లేని చోట హీరోహీరోయిన్లపై ఒక మెలోడీ సాంగ్ వచ్చి విసిగిస్తుంది. కొత్త ఆలోచనలతో వస్తోన్న దర్శకులు కొన్ని పాత పద్ధతులని కూడా విడిచిపెట్టాలి. తప్పనిసరిగా పాటలు ఉండాలి, ఫైట్లుండాలి లాంటి మూస పోకడలు మానుకోవాలి.
సుధీర్‌బాబు తన పాత్రకి న్యాయం చేసాడు కానీ ఆ పాత్రకి అవసరం లేని ఫిజిక్‌తో కనిపించాడు. తన పాత్ర ఒక మామూలు కుర్రాడిగా కనిపిస్తే మరింత రక్తి కడుతుంది. పాత్రకి అనుగుణంగా ట్రాన్స్‌ఫర్మ్ అవడమనేది, బాడీ లాంగ్వేజ్‌లో సటిల్ ఛేంజెస్ చేయడమనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. వామిక బాగుంది. బాగానే చేసింది. పోసాని కామ్‌గా ఉండాల్సిన ఫాదర్ క్యారెక్టర్‌లో కాస్త కొత్తగా కనిపిస్తాడు. తన లౌడ్ డైలాగ్స్ అన్నీ మనసులోనే అనుకునేలా చేయడం నైస్ టచ్. దివాళా తీసిన విలన్‌గా సాయికుమార్, తింగరి కిడ్నాపర్లుగా వేణు, శ్రీరామ్, కన్నింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చైతన్య కృష్ణ, గ్రీడీ గాళ్‌ఫ్రెండ్‌గా ధన్య, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్‌గా పృధ్వీ, బాత్రూమ్ బ్రేక్ కోసం డెస్పరేట్‌గా ఎదురు చూసే వాడిగా ప్రవీణ్.. అందరూ తలా ఒక చెయ్యి వేసి ఈ చిత్రాన్ని ఆసాంతం వినోదాత్మకంగా మార్చారు. క్లయిమాక్స్‌లో పృధ్వీ వీరవిహారం బాగా నవ్విస్తుంది.
సన్నీ మరోసారి తన నేపథ్య సంగీతంతో అలరించాడు. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని త్రెడ్లు ఉన్నపుడు అన్నిటినీ తక్కువ నిడివిలో సెట్ చేసిపెట్టడం ఏ ఎడిటర్‌కి అయినా పరీక్షే. వర్మ తనకి అప్పగించిన పని బాగా చేసాడు. నిర్మాతల టేస్ట్‌ని, ప్యాషన్‌ని మెచ్చుకోవాలి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'భలే' అనిపిస్తాడు. కొత్త ఆలోచనలతో పాటు ప్రేక్షకులకి వినూత్న వినోదం అందించే తెలివితేటలు కూడా ఉన్నాయి. ఈమధ్య పరిచయమైన దర్శకుల్లో అంచనాలు పెట్టుకోతగ్గ దర్శకుల్లో ముందు వరసలో ఉంటాడు. డిఫరెంట్ సినిమాలని, క్రైమ్ కామెడీ జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకులని మెప్పించే ఈ చిత్రం మసాలా లవర్స్‌ని మెప్పించలేకపోవచ్చు. ద్వితీయార్థంపై, ఆరంభంలో మందకొడి కథనంపై ఇంకాస్త శ్రద్ధ చూపించినట్టయితే ఈ జోనర్‌లో ఇదో మోడ్రన్ క్లాసిక్ అయి ఉండేది.