Sunday, April 17, 2016

ఆర్టీసీ బస్సులో ఏం జరిగిందంటే...

 ‘‘నాతోపాటు 22మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మంచి మనసున్న నిర్మాత డా. రామానాయుడుగారు. ఆయనలాగే ఎమ్మెస్ రాజుగారు ఒక్కో సినిమాకు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేయడం అభినందనీయం. ఈ సినిమా విజయవంతమై మంచి పేరు, డబ్బులు తీసుకురావాలి. టైటిల్ పాజిటివ్‌గా ఉంది’’ అని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రైట్ రైట్’. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
దర్శకులు బి.గోపాల్, మారుతి, వంశీ పైడిపల్లి కలిసి ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘డ్రైవర్, కండక్టర్‌కు మధ్య జరిగే కథే ఈ చిత్రం. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఆర్డినరీ’ సినిమా స్ఫూర్తితో ఈ చిత్రం నిర్మించాం. తొలి భాగం వినోదాత్మకంగా ఉంటే, మలి భాగంలో మిస్టరీ ఉంటుంది. ఎస్. కోట నుంచి గవిటికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘కథ కొత్తగా ఉంది. మంచి టీమ్‌తో చేసిన ఈ కొత్త ప్రయత్నం అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయనీ, త్వరలో పాటలను విడుదల చేస్తామనీ నిర్మాత తెలిపారు.
 ఈ చిత్రానికి కెమేరా: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: జె.బి, సహ నిర్మాత: ఎమ్.వి. నరసింహులు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె. శ్రీనివాస రాజు.

జడేజా పెళ్లి సందడిలో కాల్పులు


భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా వివాహం కాస్త వివాదాస్పదంగా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా సెలెబ్రిటీ ఫైరింగ్‌ చేపట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే..  రాజ్‌కోట్‌కు చెందిన రివా సోలంకితో ఈరోజు జడేజా వివాహం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి వూరేగింపు జరుగుతుండగా.. జడేజా బంధువులు సెలెబ్రిటీ ఫైరింగ్‌ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దీంతో సమాచారమందుకున్న పోలీసులు జడేజా నివాసానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాల్పులు జరిగినట్లు తమ కంట్రోల్‌ రూంకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఒకవేళ కాల్పులు లైసెన్స్‌ ఉన్న తుపాకీతో జరిపినా.. స్వీయరక్షణ సమయంలో కాకుండా ఇలా ఫైరింగ్‌ చేస్తే అది నేరమే అవుతుందని, అందుకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.

ఔను! నేను నాన్నను కాబోతున్నాను!

 తండ్రి కావడం ఎవరికైనా గొప్ప అనుభూతి. వెలకట్టలేని సంతోషం. అదే సంతోషంలో తాను మునిగి తేలుతున్నట్టు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ తెలిపాడు. 'హా మే బాప్ బాన్నే వాలా హూ'  (అవును.. నేను తండ్రిని కాబోతున్నాను) అని అతను వెల్లడించాడు.
షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు త్వరలోనే తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. మీరా రాజ్‌పుత్ గర్భవతి అయినట్టు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై ఇంతవరకు షాహిద్ స్పందించలేదు. అతని తాజా చిత్రం 'ఉడ్తా పంజాబ్‌' ట్రైలర్ విడుదల సందర్భంగా విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. 'ఎందుకండి.. డొంక తిరుగుడు ప్రశ్నలు అడుగుతారు. డైరెక్టుగా అడగండి. అవును.. నేను నాన్నను కాబోతున్నాను' అంటూ తేల్చాశాడు షాహిద్‌.

నిజంగా ఈ వార్త షాహిద్, మీరా అభిమానులకు ఆనందం కలిగించేదే. ఈ ఏడాది ఆరంభం నుంచి విడాకులు, బ్రేకప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్‌ జనాలకు తీపి కబురు అని చెప్పవచ్చు.